RRR నుంచి ఆలియా ఔట్? ఆమె స్థానంలో దేశీ గర్ల్!
ప్రస్తుతం బాలీవుడ్ లో పరిస్థితులు భట్ కుటుంబానికి వ్యతిరేకంగానే పరిణమిస్తున్నాయి. సుశాంత్ సింగ్ మరణంతో మొదలైన నెపోటిజం చర్చ, అతడి మరణంలో మహేశ్ భట్ హస్తముందనే వార్తలు ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగానే కాదు, వృత్తిపరంగానూ దెబ్బతీస్తూనే ఉన్నాయి. ఇటీవలే విడుదలైన సడక్ 2 సినిమా ట్రైలర్, అత్యంత నిరాదరణ పొందినదిగా రికార్డు సృష్టించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిస్థితుల వల్ల ఆలియా భట్ తీవ్రంగా దెబ్బతింటోందనే చెప్పాలి.
తాజాగా రాజమౌళి RRRలో ఆమె పాత్ర చుట్టూ నీలినీడలు కమ్ముకున్నాయన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సినిమా నుంచి ఆమెను తప్పించారు అన్న వార్తలు గుప్పుమన్నాయి. వాటిపై ఇంకా క్లారిటీ రాక ముందే, ఆమె స్థానంలో దేశీ గర్ల్ ప్రియాంకా చోప్రా వచ్చిందనే వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆలియా టీమ్ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేసింది.
ఆలియా స్థానంలో దేశీ గర్ల్ అన్న చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఆమె టీమ్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. RRRలో ఆలియా స్థానం పదిలంగానే ఉందని, ఆమె సినిమానుంచి తప్పుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆలియా తన పాత్ర కోసమే సిద్ధమవుతోందని, తెలుగులో నటించడం మొదటిసారి కాబట్టి, భాషపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించింది.

అంతేకాదు, రాజమౌళి కేవలం ఆలియా నటనా పటిమను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చారని, అంతేకానీ, ఆమె వెనుక ఉన్న కుటుంబ పరపతి ఆమె ఎంపికలో ఎలాంటి పాత్రా పోషించలేదని క్లారిటీ ఇచ్చేశారు. దర్శక ధీరుడు కూడా ఆమెను కొనసాగించే విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పారని స్పష్టం చేసింది ఆలియా టీమ్.


Click it and Unblock the Notifications











