సీన్ మారింది : వక్కంతం వంశీ కథతో పూరీ జగన్నాథ్
హైదరాబాద్ : వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తొలిసారిగా బయిట రచయిత కథతో పూరీ జగన్నాథ్ చిత్రం చేయబోతున్నారు. వక్కంతం వంశీ ఇచ్చిన కథతో ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం రూపొందించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ గత చిత్రాలు అశోక్, ఊసరవెల్లికి కూడా వక్కంతం వంశీనే రచయిత కావటం విశేషం. ఈ మధ్యన ఎన్టీఆర్ ని ఓ కథతో వంశీ ఒప్పించారు. ఇప్పుడు అదే కథతో పూరీ డైరక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రం మే 20న ప్రారంభం కానుంది.
పూరీ జగన్నాథ్ కేవలం పది రోజుల్లో వండి వడ్డించే కథలపై ఎన్టీఆర్ కి నమ్మకం లేకే పూరీ జగన్నాథ్ బయిట కథని తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. పూరీ జగన్నాథ్ నాలుగైదు కథలు వినిపించాడని, ఏ కథా ఎన్టీఆర్ ని ఇంప్రెస్ చేయలేకపోయిందని, అప్పుడు వంశీ కథతో చేయమని ఎన్టీఆర్ చెప్పారని తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో సినిమా చేయటం ప్రధానం అనుకున్న పూరీ ఇమ్మీడియట్ గా కథ విని, డైలాగ్స్ రాసుకోవటానికి సిద్దమయ్యారు. ఇది మంచి పరిణామం అంటున్నారు. ఖచ్చితంగా ఈ సారి కమర్షియల్ బ్లాక్ బస్టర్ వచ్చే అవకాసం ఉందంటున్నారు.

అలాగే టైటిల్ సైతం ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్లుగా 'కుమ్మేస్తా' అని పెట్టినట్లు సమాచారం. ఇక పూరీ జగన్నాథ్ సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఈ చిత్రం మరో 'ఆంధ్రావాలా' అవుతుందా లేక నిజంగానే కలెక్షన్స్ కుమ్ముతుందా అనేది తేలాలి.
మరో ప్రక్క తాజాగా ఆయన తన బ్యానర్ పై చేసే చిత్రానికి 'ఓవర్ యాక్షన్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. పూరీ జగన్నాథ్ ఎప్పుడూ క్రేజీగా ఉంటే టైటిల్స్ తో ముందుకు వచ్చి ఆకట్టుకుంటూంటారు. ఈ చిత్రాన్ని ఆయన అశోశియేట్ డైరక్ట్ చేస్తారని, చాలా తక్కువ బడ్జెట్ లో తయారయ్యే కామెడీ చిత్రమని తెలుస్తోంది.
ఓ పాపులర్ కమిడయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాసం ఉంది. పూరి తన బ్యానర్ పూరీ టూరింగ్ టాకీస్ పై ఈ చిత్రం నిర్మిస్తారు. ఈ మేరకు రీసెంట్ గా కథ విన్న పూరి తన బ్యానర్ పైనే నిర్మిస్తానని ఆ దర్శకుడుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూరీ డైలాగులు రాసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంపై నిర్మించిన హార్ట్ ఎటాక్ చిత్రం విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











