'పుష్ప 2 రన్ టైం పెంపు.. గేమ్ చేంజర్ ను దెబ్బ కొట్టడానికేనా?'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 అన్ని ఇండస్ట్రీలలో రికార్డులను దుమ్మదులిపేస్తోంది. కేవలం 32 రోజుల వ్యవధిలోనే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో ఉన్న బాహుబలి 2 (రూ.1810 కోట్లు) రికార్డును బద్ధలుకొట్టింది. పుష్ప ది రైజ్ తర్వాత ఏ సినిమాను ముట్టుకోకుండా దాదాపు మూడేళ్ల పాటు అల్లు అర్జున్ పడ్డ కష్టానికి సరైన ప్రతిఫలం లభించింది.
సాధారణంగా టాలీవుడ్‌లో సీక్వెల్స్ అంతగా క్లిక్ కావని ఓ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. కానీ మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా పాటలు, డైలాగ్స్ దేశాన్ని ఊపేశాయి. ఏకంగా రాజకీయ నాయకులు కూడా పుష్ప డైలాగ్స్‌తో ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డారు. ఇక క్రికెటర్లు , సెలబ్రిటీలు పుష్పరాజ్ మేనరిజమ్స్‌ని అనుకరిస్తూ చేసిన రీల్స్ సోషల్ మీడియాను ఒక ఊపాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సీక్వెల్‌పై అంచనాలను పెంచేశాయి.

అల్లు అర్జున్ లుక్, గెటప్, పాటలు, టీజర్, ట్రైలర్లు మరింత హైప్ తీసుకొచ్చి భారీ బిజినెస్ జరపగడంతో పాటు ఓపెనింగ్స్ కుమ్మేశాయి. అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలు, కేరళలో వసూళ్లు అంతంత మాత్రంగానే రాగా.. హిందీ బెల్ట్ మాత్రం పుష్ప 2 థియేటర్లకు పోటెత్తింది. దాని ఫలితమే ఈ స్థాయి వసూళ్లు. బాలీవుడ్ సినిమాలను సైతం పక్కకునెట్టి అత్యధిక కలెక్షన్స్ సాధించిన హిందీ చిత్రంగా పుష్ప 2 ది రూల్ నిలిచింది.
దాదాపు నెల రోజులుగా పుష్ప 2 తప్పించి థియేటర్లలో మరో మాట వినిపించలేదు. అయితే ఈ జోరుకు సంక్రాంతి సినిమాలు బ్రేక్ వేయనున్నాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్, జనవరి 12న డాకు మహారాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా మూవీ. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు శంకర్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ పోటీని తట్టుకునేందుకు, పండగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు గాను మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని షాట్స్‌ను సినిమాకు యాడ్ చేస్తారని టాక్. దీంతో వీటి కోసం పుష్ప లవర్స్ మరోసారి థియేటర్లకు పోటెత్తుతారని ప్రచారం జరుగుతోంది. అంతా బాగానే ఉంది కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న తెల్లారే అంటే జనవరి 11 నుంచే ఈ రీలోడెడ్ వెర్షన్ అందుబాటులోకి రానుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

గేమ్ ఛేంజర్ ఏమాత్రం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా పుష్ప 2 వసూళ్లు కుమ్మేస్తుంది. తెలుగులో ఏమో కానీ.. హిందీ బెల్ట్‌లో మాత్రం గేమ్ ఛేంజర్‌పై పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో రామ్ చరణ్‌ను దెబ్బకొట్టడానికే సరిగ్గా గేమ్ ఛేంజర్ రిలీజ్ టైంలో ఎక్స్‌ట్రా రన్ టైమ్ యాడ్ చేస్తున్నారా అంటూ మెగా ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతున్నారు. అయితే ఒక్క గేమ్ ఛేంజర్ పైనే కాదు సంక్రాంతి బొమ్మలైన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం పైనా పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి పుష్పగాడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో.


Click it and Unblock the Notifications











