RRR టైటిల్ ఫిక్స్: వాళ్లు పంపిన పేరునే ఫైనల్ చేశారు.. ఫ్యాన్స్ మధ్య వార్ లేకుండా రాజమౌళి ప్లాన్.!
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ హంగులతో తెరకెక్కుతోన్న సినిమా RRR. 'బాహుబలి' వంటి బడా ప్రాజెక్టు తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడానికి తోడు ఇందులో ఇద్దరు బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమా గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా.. సంచలనమే అవుతోంది. ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమా టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం.!

RRR వెనుక ఉన్న అసలు కథ ఇదే
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీమ్‌గా, చరణ్.. అల్లూరిగా కనిపించబోతున్నారు. వారి జీవిత కథకు కొన్ని ఊహాజనిత సన్నివేశాలు జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న.

అసలైంది మాత్రం బ్యాలెన్స్ ఉంది
RRR షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. అయితే, ఇందులో నటిస్తున్న హీరోలు, ఇతర నటుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడానికి తోడు పలు కారణాల వల్ల షూటింగ్‌కు పలుమార్లు ఆటంకం ఏర్పడింది. దీంతో ఈ మూవీ షూటింగ్ డెబ్బై శాతం మాత్రమే పూర్తయింది. మిగిలిన భాగంలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది.

అందరూ అనుకున్నట్లే చేసిన టీమ్
షూటింగ్ పూర్తవకపోవడం.. పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో విడుదల చేయాలని భావిస్తుండడంతో ఈ సినిమా అనుకున్న సమయానికి రాకపోవచ్చని జోరుగా ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా విడుదలను జనవరి 8, 2021కి వాయిదా వేసింది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ మూవీని జూలై 30, 2020న విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఒక్కటి కూడా రాలేదు.. ఫ్యాన్స్‌లో నిరాశ
ఎన్నో అంచనాలతో రాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి కనిపిస్తోంది. ఇక, మెగా.. నందమూరి అభిమానులు మాత్రం చిత్ర యూనిట్‌పై ఆగ్రహంతో ఉన్నారు. దీనికి కారణం... షూటింగ్ ప్రారంభమై ఏడాది పూర్తయినప్పటికీ ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా రాకపోవడమే. ఈ క్రమంలోనే ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి.

RRR టైటిల్ ఫిక్స్.. వాళ్లు పంపినదే
RRR ఈ సినిమా టైటిల్ అయినప్పటికీ.. దీనికి క్యాప్షన్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అంతేకాదు, ఫ్యాన్స్ నుంచి కొన్ని పేర్లను కూడా పంపమని కోరింది. దీంతో చాలా మంది కొన్ని వందల పేర్లు పంపారు. అందులో వచ్చిన ఒక టైటిల్ ‘రఘుపతి రాఘవ రాజారాం'నే చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.
Recommended Video


ఫ్యాన్స్ మధ్య వార్ లేకుండా ప్లాన్.!
ఈ సినిమాకు ‘రఘుపతి రాఘవ రాజారాం' అనే టైటిల్‌నే ఫైనల్ చేయడానికి వెనుక బలమైన కారణం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంక ఏదైనా టైటిల్ పెడితే.. మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. ‘రఘుపతి రాఘవ రాజారాం' అయితే అందరికీ సమ్మతంగా ఉంటుందని వాళ్లు అనుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











