అమ్మాయిలకు అలాంటి ఏజెన్సీలుంటే బాగుంటుంది: రాజమౌళి..!?
కమీడియన్ సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా ఇటీవల రాజమౌళి రూపొందించిన 'మర్యాద రామన్" చిత్రం హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకొని అన్ని ప్రముఖ నగరాలలో విజయయాత్ర నిర్వహిస్తున్న మర్యాద రామన్న టీమ్ విజయవాడలో విజయయాత్రను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ మర్యాద రామన్న ఓ పెద్ద చిన్నసినిమా అని, 321 ప్రింట్లతో విడుదలైందని తెలిపారు.
ముంబైలో పేరుపొందిన ప్రకటనల ఏజెన్సీలు ప్రతిభగల అమ్మాయిలను బాలీవుడ్ కు అందిస్తాయని, అందువల్ల చాలామంది అమ్మాయిలు సినిమాలను కెరీర్ గా ఎంచుకొని అక్కడ ఎదుగుతున్నారని అన్నారు. కానీ ఇక్కడ అలాంటి ఏజెన్సీలు లేవని, ఒకవేళ ఉన్నా వాటిని సంప్రదించేందుకు ఇక్కడి తెలుగమ్మాయిలు వెనుకాడుతున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతిభ గల తెలుగు అమ్మాయిలు ఉన్నప్పటికీ, సరైన వేదిక లేనందువల్ల తెలుగు దర్శకులకు హీరోయిన్ పాత్రలకు హిందీ భామలను తీసుకోక తప్పడం లేదని రాజమౌళి తెలిపారు.
ఒక సినిమాను తీయడం ఎంత ముఖ్యమో, ఆ సినిమాను ప్రమోట్ చేయడం అంతకంటే ముఖ్యమనే విషయాన్ని చెప్పకనే చెబుతూ, విసత స్థాయిలో 'మర్యాద రామన్న" చిత్రానికి ప్రచారం కల్పిస్తూ..ఆదర్శప్రాయంగా నిలుస్తున్న రాజమౌళిని అందరూ అభినందించి తీరాల్సిందే. ముఖ్యంగా రాజమౌళిని చూసి, మిగతా దర్శకులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందంటూ పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











