ఆ సినిమాను రీమేక్ చేస్తున్న రాజశేఖర్.. ఒకేసారి రెండు భాషల్లో విడుదల
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ మాంచి ఫామ్‌లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా నటించిన 'పీఎస్‌వీ గరుడవేగ' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టాక్‌ను సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్లను కూడా బాగానే రాబట్టింది. దీంతో ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ ఘనంగా ప్రారంభమైంది. ఇదే ఊపుతో రాజశేఖర్ ఈ ఏడాది 'కల్కి' అనే సినిమాను చేశారు. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఇందులో రాజశేఖర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా తర్వాత ఆయన మరో ప్రాజెక్టును ప్రకటించలేదు. గతంలో మాదిరిగా వరుస పెట్టి సినిమాలు చేయకుండా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికితోడు, ఆయన చిన్న కుమార్తె శివాత్మక - ఆనంద్ దేవరకొండ నటించిన 'దొరసాని' విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం రాజశేఖర్ చాలా శ్రమించారు. అంతకుముందు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. వీటన్నింటి వల్ల ఆయన కొత్త సినిమా తాలూకు ప్రకటన చేయలేదు.

ఇక, తాజాగా రాజశేఖర్ చేయబోయే సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నడంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమాను ఆయన తెలుగులో చేయబోతున్నారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ నిర్మాత ధనుంజయ్ తెరకెక్కించనున్న వీటిలో తెలుగులో రాజశేఖర్, తమిళంలో సత్యరాజ్ (కట్టప్ప) తనయుడు శిబి నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నారని టాక్.


Click it and Unblock the Notifications











