రెండు కోట్లతో రామ్ చరణ్ విల్లా
త్వరలో ఓ ఇంటివాడు అవుతున్న రామ్ చరణ్ రెండు కోట్లతో ఓ విల్లాని కట్టిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని కోకాపేట లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గర ఈ విల్లా నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాలుగువేల చదరపు అడుగుల వైశాల్యంతో పూర్తిగా చెక్కతో ఈ విల్లాని నిర్మిస్తున్నారు. ఎక్కడా సిమెంట్ ని కానీ, ఇసుకని కానీ ఈ విల్లా నిర్మాణంలో వాడరు. బెంగుళూరు నుంచి వచ్చిన నిపుణులు కొందరు ఈ పని మీద ఉన్నట్లు తెలుస్తోంది. చరణ్ కాబోయే భార్య ఉపాసన దగ్గరుండి దానని పర్యవేక్షిస్తన్నట్లు సమాచారం.
ఇక రామ్‌చరణ్, ఉపాసనా కామినేనిల నిశ్చితార్థమే అందరూ మాట్లాడుకునేంత ఘనంగా జరగనుందని సమాచారం. నవంబర్‌లో వీరి నిశ్చితార్థాన్ని జరపడానికి ఇటు చిరంజీవి కుటుంబం అటు కామినేని కుటుంబం ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ నిశ్చితార్థ వేడుకకు హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఫైవ్ స్టార్ హోటలు వేదికగా తీసుకోవటం లేదు. హైదరాబాద్‌కి 105 కిలోమీటర్ల దూరంలోని ఉపాసనా తాతయ్య ఉమాపతికి చెందిన దోమకొండగడిని ఈ నిశ్చితార్థానికి వేదికగా చేయనున్నారు . అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి.
ఇప్పటికే దోమకొండగడికి సంబంధించిన మరమ్మత్తులను ఆరంభించారు. మూడువందల ఏళ్ల నాటి ఈ కోటను పునరుద్ధరించి, అలంకరింపజేయడానికి దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారని వినికిడి. ఇదిలా వుండగా ఈ నిశ్చితార్థ విందు కూడా అద్బతంగా ఉండబోతోంది. దానికోసం నెల్లూరుకి చెందిన చెయ్యి తిరిగినవారితో మాంసాహార వంటకాలను, తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారితో శాకాహార వంటకాలను వండించనున్నారట. ఇదిలా వుండగా రామ్‌చరణ్, ఉపాసనల నిశ్చితార్థం దోమకొండగడిలో జరుగుతోందని తెలిసి ఆ ప్రాంతాన్ని చూడటానికి సందర్శకులు, హీరో అభిమానుల తాకిడి ఇప్పటినుంచే అధికమవుతోంది.ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రచ్చ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
సంపత్ నంది దర్సకత్వంలో రూపొందుతున్న రచ్చ చిత్రాన్ని క్రిసమస్ కానుకగా విడుదల చేయాలని రామ్ చరణ్ చెప్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంకోసం రామ్ చరణ్ మియామి, అమెరికలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తమన్నా రామ్ చరణ్ తో జోడికడుతున్న ఈ సినిమాలో చరణ్ మిడిల్ క్లాస్ కుర్రాడుగా పక్కా మాస్ పాత్రను చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ 'రచ్చ'సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తుంది.


Click it and Unblock the Notifications











