హాట్ టాపిక్ : జుట్టు పెంచే పనుల్లో రామ్ చరణ్
హైదరాబాద్: సినిమా సినిమాకూ కొత్తగా కనిపిస్తూ తమ అభిమానులను ఆనందపరచటమనేది మన హీరోలకు ఆసక్తి కరమైన అంశం. సినిమాకు తగినట్లు తమను తాము తీర్చిదిద్దుకోవటంలో యంగ్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరు సిక్స్ ప్యాక్ తో ముందుకు వెళ్తూంటే..మరి కొందరు తమ ఆహార్యం మార్చుకుని మరీ అలరించటానికి సిద్దమవుతున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తన హెయిర్ స్టైయిల్ లో మార్పు కోసం జుట్టుని పెంచుతున్నాడు. పోనీ టెయిల్ తో స్టైలిష్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అదీ కృష్ణవంశీ చిత్రం కోసం కావటం తో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
రామ్‌చరణ్ కూడా సినిమా సెట్‌లోకి అడుగు పెట్టక చాలా రోజులైంది. 'తుఫాన్' తర్వాత ఆయన పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయించారు. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించడానికి చరణ్ సిద్ధమయ్యారు. ఇందులో శ్రీకాంత్ ఓ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఫిబ్రవరి 6న సినిమా చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ చిత్రం కోసం చరణ్, శ్రీకాంత్ జుట్టు పెంచే పనుల్లో ఉన్నారు.

రామ్ చరణ్ మొదటిసారిగా కృష్ణవంశీతో కలిసి నటిస్తున్నాడు. తమిళ నటుడు రాజ్ కిరణ్(పందెంకోడి నటుడు) ఈ సినిమాలో ముఖ్యపాత్రధారి. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్లగణేష్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీకాంత్ ముఖ్యపాత్ర పోషిస్తాడని సమాచారం. ఈ సినిమా బృందంతో కలిసి ప్రస్తుతం కృష్ణవంశీ పొల్లాచి లో లోకేషన్ల వేటకు వెళ్ళాడు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.
ఇటీవల ఇంటిల్లిపాదినీ మెప్పించే ఫ్యామిలీ కథలపైనే రామ్‌చరణ్ ఎక్కువగా దృష్టిపెడుతున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కృష్ణవంశీ సిద్ధం చేసిన కథని ఎంచుకొన్నారు. తదుపరి కూడా అదే తరహాలో సాగే ఓ కథలో నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. కుటుంబ కథా చిత్రాలని బాగా తీస్తారని పేరున్న దశరథ్ ఇటీవల రామ్‌చరణ్‌ని దృష్టిలో ఉంచుకొని ఓ కథని సిద్ధం చేసుకొన్నారట. అది త్వరలోనే ఆయనకి వినిపించబోతున్నారని తెలుస్తోంది. దీంతో మరికొన్ని కథల్ని కూడా రామ్ చరణ్ విన్నట్టు తెలుస్తోంది. వచ్చే యేడాది రామ్‌చరణ్ రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
ఇక నిన్న (ఆదివారం) రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు చిత్రం భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ చిత్రంలో చరణ్ కనిపించే విధానం కొత్తగా ఉంది. ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించి అలరించారు. బావాబావమరుదులు కలిసి చేసిన తొలి చిత్రం ఇదే కావడంతో అభిమానులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. సైంటిఫిక్ అంశాలతో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ఇది . వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











