రామ్ చరణ్ జోడిగా కన్నడ బ్యూటీ..! సుకుమార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ తర్వాత, ఇప్పుడు చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమాను 2026 మార్చి 27న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే మరో ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే దర్శకుడు సుకుమార్‌తో చరణ్ చేయబోయే సినిమా. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమా కావడంతో, మొదటి నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో రామ్ చరణ్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019లో బీర్బల్ అనే కన్నడ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు, 2023లో వచ్చిన సప్త సాగరాలు దాటి మూవీ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సహజమైన యాక్టింగ్, ఎమోషనల్ డెప్త్‌తో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అందరి మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో నటించినా, ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన 'కాంతారా: చాప్టర్ 1’తో రుక్మిణి వసంత్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ వచ్చింది. ఈ భారీ బ్లాక్‌బస్టర్‌తో ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది.
దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా రుక్మిణి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు అదే క్రేజ్‌తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రుక్మిణి వసంత్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత ఈ కాంబో నుంచి మరో పవర్‌ఫుల్ మూవీ రాబోతోందన్న అంచనాల మధ్య, హీరోయిన్ ఎంపిక కూడా సుకుమార్ మాస్టర్ ప్లాన్‌లో భాగమేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరి నిజంగానే రామ్ చరణ్ జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తుందా? సుకుమార్ ఈ కన్నడ బ్యూటీతో మరో మ్యాజిక్ చేయబోతున్నాడా? అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











