రణ్‌వీర్-ఆదిత్యాధర్ కాంబో రిపీట్.. దురంధర్ 2 తర్వాత బిగ్ స్కెచ్!
రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) - ఆదిత్య ధర్ (Aditya Dhar) కాంబినేషన్ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేయడంతో ఈ జోడీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్‌లోనే రూ.1100 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో 'ధురంధర్ 2' అగ్రస్థానాల వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.1800 కోట్లకు పై వసూళ్లు సాధించి, 'పుష్ప 2' రికార్డును అధిగమించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కన్నా ముందుగా 'దంగల్', 'బాహుబలి 2' వంటి భారీ చిత్రాలు మాత్రమే ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే 'బాహుబలి 2' రికార్డును కూడా ఈ చిత్రం దాటే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు ఆదిత్య ధర్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.'ఉరి', 'ధురంధర్' వంటి సినిమాలతో తన సత్తా చాటుకున్న ఆదిత్య ధర్.. మరోసారి భారీ స్కేల్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆయన దృష్టి భారత చరిత్రలో గొప్ప చక్రవర్తులలో ఒకరైన చంద్రగుప్త మౌర్య జీవితగాథపై పడిందని టాక్ వినిపిస్తోంది. మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడి చరిత్రను ఆధారంగా చేసుకుని ఓ మెగా హిస్టారికల్ ఎపిక్ రూపొందించాలని ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నారట.
అయితే.. ఈ ప్రాజెక్ట్‌లో చంద్రగుప్త మౌర్య పాత్రకు రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేయాలని దర్శకుడు భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 'పద్మావత్', 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాల్లో చారిత్రక పాత్రల్లో తన నటనతో మెప్పించిన రణ్‌వీర్.. ఈ పాత్రకు సరైన ఎంపిక అవుతాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు చాణక్య పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పేరు వినిపిస్తోంది. తన గంభీరమైన నటన, డైలాగ్ డెలివరీ, తెరపై ఉన్న గ్రావిటీ కారణంగా చాణక్య పాత్రకు అక్షయ్ ఖన్నా పర్ఫెక్ట్‌గా సరిపోతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ ప్రస్తుతం ఆదిత్య ధర్ రణ్ వీర్ సింగ్ ఫొటోను వైరల్ చేస్తుమరో 3000 కోట్ల బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ ఓ యూజర్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది.
ఇదిలా ఉంటే.. సమాచారం ప్రకారం ఆదిత్య ధర్ ప్రస్తుతం మూడు కథలను పరిశీలిస్తున్నారట. మొదటిది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 'ది ఇమ్మార్టల్ అశ్వత్థామ', రెండోది చంద్రగుప్త మౌర్య హిస్టారికల్ ఎపిక్, మూడోది ఒక స్పోర్ట్స్ డ్రామా. అయితే 'ధురంధర్ 2' విజయం తర్వాత ఆయన భారీ స్కేల్ సినిమాల వైపు మరింత మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అందుకే చంద్రగుప్త మౌర్య ప్రాజెక్ట్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ నిజంగా తెరకెక్కితే భారతీయ చరిత్రలో అత్యంత గొప్ప సామ్రాజ్యాలలో ఒకటైన మౌర్య సామ్రాజ్య స్థాపన, చాణక్య వ్యూహాలు, అలెగ్జాండర్ దండయాత్రల తర్వాతి రాజకీయ పరిణామాలు, చంద్రగుప్తుడి ఎదుగుదల వంటి ఆసక్తికర అంశాలు తెరపై చూపించే అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, యుద్ధ సన్నివేశాలు, రాయల్ సెట్లు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా రూపొందే అవకాశముందని టాక్. అందుకే రూ.3000 కోట్ల బడ్జెట్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే , మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ రణ్‌వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుందన్న వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే.. భారతీయ చరిత్రను ప్రపంచస్థాయిలో పరిచయం చేసే మరో అద్భుతమైన ఎపిక్ చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే.. అందరి చూపు ఆదిత్య ధర్ తదుపరి అధికారిక ప్రకటనపైనే ఉంది.


Click it and Unblock the Notifications