Spirit: ప్రభాస్‌కు జోడీగా నేషనల్ హీరోయిన్.. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది హిట్టే!
తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్‌ను పెంచిన హీరోలు అతి తక్కువ మందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబెల్ స్టార్ ప్రభాస్‌దే. అంతలా అతడు 'బాహుబలి' సిరీస్ తర్వాత నుంచి తనదైన భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ దేశ వ్యాప్తంగా సత్తా చాటుతోన్నాడు. అదే సమయంలో చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతూ సెన్సేషన్ అవుతున్నాడు.
గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్'తో క్రేజీ హిట్‌ను అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ 2', 'రాజా సాబ్' వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. అటు ప్రభాస్, ఇటు సందీప్ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ లీకైంది.
'స్పిరిట్' మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే టైటిల్‌పై స్టార్స్ ఉండడంతో ఇది పోలీస్ కథతో వస్తుందని అర్థమైంది. ఇక, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తుందని తెలిసింది.

రష్మిక మందన్నాకు ఇప్పటికే 'స్పిరిట్' మూవీకి సంబంధించిన స్క్రిప్టును సందీప్ రెడ్డి వంగా వినిపించాడట. ఇది బాగా నచ్చడంతో ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ప్రభాస్‌తో ఆమెకిది మొదటి చిత్రం కాగా.. సందీప్ రెడ్డి వంగాతో 'యానిమల్' చేసింది. ఇది సెన్సేషనల్ హిట్ అయింది. అదే సెంటిమెంట్ ప్రకారం దర్శకుడు ఆమెను తీసుకున్నాడని అంటున్నారు.
హై రేంజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు. ఇది ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











