మహేష్ నో అన్న పాత్రకు రవితేజ సై
హైదరాబాద్: ఓ హీరో కాదన్న పాత్రను మరో హీరో చేయటం సినీ పరిశ్రమలో చాలా సార్లు జరుగుతూంటుంది. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకో, స్టార్ డమ్ అడ్డొచ్చో, కథ నచ్చకో, తమ పాత్ర నచ్చకో చాలా సార్లు హీరో వాటిని సున్నితంగా రిజెక్టు చేస్తూంటారు. వాటిని మరో హీరో మహదానందంగా భుజాన ఎత్తుకుంటూంటాడు. తాజాగా అటువంటి సంఘటన ఒకటి జరిగిందని సమాచారం. మహేష్ బాబు రిజెక్టు చేసిన గెస్ట్ రోల్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని విశ్వసనీయ సమాచారం. త్వరలోనే అంటే పిభ్రవరి రెండవ వారంలో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈచిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... మహేష్ బాబు తాను డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేనని నో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు దానిని రవితేజ చేస్తున్నాడని తెలుస్తోంది. రవితేజకు,గుణశేఖర్ కు ఉన్న అనుబంధంతో ఈ సీన్స్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో రవితేజ ఆ సీన్లు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.
తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'


Click it and Unblock the Notifications












