మాస్ మహారాజ్ రవితేజ అప్‌డేట్.. తమిళ్ సినిమా రీమేక్‌లో!
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు మాస్ మాహారాజ్ రవితేజ. ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిసాస్టర్ తన ఖాతాలో వేసుకున్న ఆయన ప్రస్తుతం 'డిస్కో రాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రవితేజ మరో సినిమాకి సైన్ చేశారని తెలుస్తోంది.
తమిళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన చిత్రం 'విక్రమ్‌వేద'. దర్శకద్వయం పుష్కర్, గాయత్రి తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విక్రమ్‌గా మాధవన్ నటించగా, గ్యాంగ్‌స్టర్ వేద పాత్రలో విజయ్‌సేతుపతి నటించారు. ఇదే సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ రీమేక్‌లో మాస్ మహారాజా రవితేజను హీరోగా తీసుకోనున్నారని తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కుతుందట. ఈ మేరకు సుధీర్ వర్మ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్‌గా రవితేజ కనిపిస్తే.. గ్యాంగ్‌స్టర్ వేద పాత్రను ఎవరు పోషిస్తారనే క్యూరియాసిటీ నెలకొంది ప్రేక్షకుల్లో.

ఇక మరోవైపు రవితేజ తన తాజా సినిమా డిస్కో రాజా షూటింగ్ త్వరత్వరగా పూర్తిచేస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











