మెగా మేనల్లుడి సినిమా ‘రేయ్’ ఢమాల్!
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా 'రేయ్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో దీన్ని రూపొందిస్తున్నారు. కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగడం లేదు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం 'రేయ్' ప్రాజెక్టు రద్దయిందని, సినిమా ఇక అటకెక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ సమస్యలే ఈ చిత్రం రద్దవడానికి ప్రధాన కారణమని అంటున్నారు.
మెగా కుటుంబం సాయి ధరమ్ తేజను మరొక చిత్రం ద్వారా అతన్ని ప్రేక్షకుల ముందు లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేచ్ చిత్రం 2010, అక్టోబర్ 17న విజయ దశమిని పురస్కరించుకుని రామానాయుడు స్టూడియలో గ్రాండ్ గా ప్రారంభించారు. ఈకార్యక్రమానికి మెగాఫ్యామిలీలోని చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్ తో పాటు, ఏఎన్ఆర్, నందమూరి హరికృష్ణ, కళ్యాణ్ రామ్, రామానాయుడు, కె. రాఘవేంద్రరావు లాంటి ఇండస్ట్రీ ప్రముఖులు హాజరయ్యారు.
ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమా షూటింగ్ జరిగింది. ఏమైందో ఏమోగానీ వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిలిపి వేసి.....రవితేజ హీరోగా 'నిప్పు' చిత్రాన్ని రూపొందించి తీవ్రంగా నష్ట పోయాడు. ఆ తర్వాత 'రేయ్' సినిమా తీయడానికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడటంతో చిరంజీవి కల్పించుకుని ఓ పీఆర్పీ ఎమ్మెల్యేకు నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పారని వార్తలు వచ్చాయి. అయినా సినిమా మొదలైన దాఖలాలు కనిపించలేదు. తాజాగా సినిమా అటకెక్కిందని, రద్దయిందని వార్తలు వస్తుండటంతో మెగా అభిమానులు విషయం అర్థం కాక అయోమయంలో పడ్డారు.


Click it and Unblock the Notifications











