Sai Pallavi: మరో క్రేజీ బయోపిక్.. లీడ్ రోల్‌లో సాయి పల్లవి?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె మరోసారి క్రేజీ బయోపిక్ వార్తలతో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ బాగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిష్టాత్మక బయోగ్రాఫికల్ ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం ఎం. ఎస్ సుబ్బలక్ష్మి (M.S.Subbulakshmi) బయోపిక్‌లో ఆమె నటిస్తున్నట్టు టాక్. ఈ సమయంలో మరో లెజెండరీ నటి బయోపిక్ ఆఫర్ వచ్చిందట. ఇంతకీ ఆ బయోపిక్ ఎంటీ?
ఆ బయోపిక్ ఎంటో కాదు.. 1950-60 దశకాల్లో హిందీ సినీరంగాన్ని ఏలిన అందాల నటి మధుబాల (Madhu Bala). ఈ లెజండరీ యాకర్ట్ జీవిత కథను తెరపైకి తీసుకురావాలని బాలీవుడ్‌లో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'వీనస్ ఆఫ్ ఇండియన్ సినిమా'గా పేరొందిన మధుబాల అందం, నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మొఘల్ ఈ అజామ్ (Mughal-e-Azam) సినిమాలో ఆమె పోషించిన అనార్కలి పాత్ర భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. గత రెండు ఏండ్లుగా ఈ బయోపిక్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ సినిమా ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మళ్లీ వేగం అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాకు డైరెక్టర్ జస్మీత్ కె. రీన్ తెరకెక్కించినున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ లో మధుబాల పాత్ర కోసం సాయి పల్లవి పేరు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె సహజ నటన, మేకప్ లేకుండా కూడా తెరపై కనిపించే ఆకర్షణ, క్లాసికల్ గ్రేస్ మధుబాల పాత్రకు సరిపోతాయని కొందరు భావించారని సమాచారం. అయితే, సాయి పల్లవి ఇప్పటికే ఇతర పెద్ద ప్రాజెక్ట్‌లకు డేట్స్ కేటాయించడం వల్ల ఈ బయోపిక్‌లో చేరే అవకాశం ప్రశ్నార్థకంగా మారింది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయి పల్లవి?
ఇక మరోవైపు భారతీయ శాస్త్రీయ సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని కూడా సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) ఈ ప్రాజెక్ట్‌ను ముందుండి నడిపిస్తున్నారని టాక్. ఈ సినిమాకు దర్శకుడిగా గౌతమ్ తిన్నానూరి (Gowtam Tinnanuri) పేరు వినిపిస్తోంది. 'జెర్సీ', 'మళ్లీ రావా' వంటి భావోద్వేగభరిత చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్నానూరి ఈ బయోపిక్‌ను తెరకెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయని, ప్రీ-ప్రొడక్షన్ దశలో ప్రాజెక్ట్ ఉందని సమాచారం. ఈ సినిమాలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర కోసం కూడా సాయి పల్లవిని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమెకు ఉన్న సహజ నటన, క్లాసికల్ వ్యక్తిత్వం, మేకప్ లేకుండా కనిపించే గ్రేస్ సుబ్బులక్ష్మి పాత్రకు సరిపోతాయని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అదనంగా తమిళం, తెలుగు భాషలపై ఆమెకు ఉన్న పట్టు ఈ సినిమాను ద్విభాషా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించేందుకు అనుకూలంగా ఉంటుందని కూడా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి కెరీర్ పీక్స్ లో ఉంది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ( Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న రామయణ (Ramayana) సినిమాలో భాగమైంది. ఈ సినిమాలో సాయిపల్లివి సీత పాత్రలో నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే సమయంలో ఆమె మరో బాలీవుడ్ చిత్రం ఏక్ దిన్ (Ek Din)లో కూడా నటిస్తోంది. ఇందులో ఆమెకు జోడీగా జూనైద్ ఖాన్ (Junaid Khan)నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్‌లో అధికారికంగా అడుగుపెడుతోంది.
సాయి పల్లవి పేరు వరుసగా బయోపిక్‌లకు వినిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా మధుబాల లేదా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వంటి లెజెండరీ వ్యక్తిత్వాలను ఆమె తెరపై ఎలా ఆవిష్కరిస్తుందో అన్న ఆసక్తి సినీప్రియుల్లో కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్ట్‌ల విషయంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈ వార్తలు నిజమైతే, సాయి పల్లవి కెరీర్‌లో ఇవి మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ బయోపిక్‌లలో ఆమె నిజంగా నటిస్తుందా లేదా అన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











