సాయి పల్లవికి ఊహించని షాక్ ? ఆ బిగ్ ప్రాజెక్ట్‌లోకి కాంతార బ్యూటీ ఎంట్రీ!
సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా, సంగీత రంగాల్లో విశేష కీర్తి సాధించిన ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే భారతీయ సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న గ్రహీత ఎం.ఎస్. సుబ్బలక్ష్మి (MS Subbulakshmi) బయోపిక్ తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పేరు భారతీయ సంగీత చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం. తన స్వరంతో దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. కర్ణాటక సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అరుదైన కళాకారిణిగా గుర్తింపు సంపాదించుకున్నారు. భారతరత్న అందుకున్న తొలి సంగీత విద్వాంసురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించారు. అలాంటి మహనీయురాలి జీవితాన్ని సినిమాగా తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా 'జెర్సీ', 'మళ్లీ రావా' వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించనున్నట్లు సమాచారం. భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించడంలో గౌతమ్‌కు మంచి పేరుంది. అందుకే ఎం.ఎస్.సుబ్బలక్ష్మి జీవితంలోని సంగీత ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లు, ఆమె సాధించిన విజయాలను తెరపై అద్భుతంగా చూపించగలడనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక విషయంలో తాజాగా పెద్ద ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్ర కోసం నేచురల్ స్టార్ సాయి పల్లవిని పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఆమె నటనలో సహజత్వం, హుందాతనం వంటి లక్షణాలు సాయి పల్లవిని ఈ పాత్రకు సరైన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు.. సంప్రదాయ పాత్రల్లో ఆమె ఇప్పటికే మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో సాయి పల్లవి సరైన ఎంపిక అని అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.
కానీ తాజా సమాచారం ప్రకారం.. సాయి పల్లవి ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా 'రామాయణం' వంటి పాన్ ఇండియా మూవీ, ఇతర కమిట్‌మెంట్లు, కాల్‌షీట్ సమస్యలు కారణంగా ఈ బయోపిక్‌కు సమయం కేటాయించడం కష్టమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన రాకపోయినా.. ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే.. సాయి పల్లవి స్థానంలో ఇప్పుడు కన్నడ నటి రుక్మిణి వసంత్ పేరు బలంగా వినిపిస్తోంది. 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో సౌత్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రుక్మిణి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. భావోద్వేగ సన్నివేశాలను సహజంగా నటించగల సామర్థ్యం ఆమెకు ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, క్లాసికల్ లుక్, సంప్రదాయ శైలి, తెరపై హుందాతనం ఆమెకు ఈ పాత్రకు అదనపు బలం అవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే రుక్మిణి వసంత్ పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
అలాంటి సమయంలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వంటి లెజెండరీ పాత్ర చేయడం ఆమె కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా మారే అవకాశం ఉంది. ఒక గొప్ప సంగీత విద్వాంసురాలి పాత్రలో ఆమె ఎలా ఒదిగిపోతుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన్ ఎంపికపై స్పష్టత రావడంతో పాటు.. షూటింగ్ షెడ్యూల్, ఇతర నటీనటులు, సంగీత దర్శకుడు వంటి వివరాలు కూడా త్వరలో బయటకు వచ్చే అవకాశముంది. సంగీత ప్రపంచంలో చిరస్మరణీయమైన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి జీవితాన్ని గౌతమ్ తిన్ననూరి ఎలా ఆవిష్కరిస్తారు? ఆ పాత్రలో రుక్మిణి వసంత్ ఎంతవరకు మెప్పిస్తారు? అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.


Click it and Unblock the Notifications