బాలయ్య సినిమాలో మరో హీరో.. హిట్ ఇచ్చిన బోయపాటి కోసం గ్రీన్ సిగ్నల్.!
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఎక్కువగా మాస్ చిత్రాలనే చేస్తూ బీ సీ సెంటర్ల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన... కొన్నేళ్లుగా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే లుక్, ఫిజిక్ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరో పవర్‌ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆ మూవీలో మరో హీరో కూడా నటిస్తున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

వరుస ఫ్లాప్‌లు... అయినా తగ్గడం లేదు
నందమూరి బాలకృష్ణ అంత స్పీడుగా మరో హీరో సినిమాలు చేయలేడు అన్న టాక్ ఉన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం ఆయన మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, దురదృష్టవశాత్తూ అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయినా బాలయ్య అస్సలు తగ్గట్లేదు.

హ్యాట్రిక్ కోసం ఆయనతో.. బాలయ్య ప్లాన్
వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు బాలయ్య. ఈ నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో ‘సింహా', ‘లెజెండ్' వంటి రెండు భారీ విజయాలను అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్నాడు. దీని ద్వారా హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు హ్యాట్రిక్ కొట్టాలని ఈ జంట పట్టుదలతో ఉంది.

బాలకృష్ణ కెరీర్‌లో మొదటిసారి ఈ రేంజ్
రెండు సూపర్ హిట్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో... ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీగా ఖర్చు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం దాదాపు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే అన్నీ హై రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఒక్క వీడియో.. అంచనాలు పెంచేసింది
వాస్తవానికి బాలయ్య - బోయపాటిది హిట్ కాంబినేషన్ అయినప్పటికీ... ఈ సినిమాపై అంచనాలు అంతగా లేవు. రొటీన్ మాస్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే, బాలయ్య పుట్టినరోజున BB3 పేరిట విడుదలైన ఈ సినిమా టీజర్‌తో అంతా మారిపోయింది. అప్పటి వరకు ఉన్న పరిస్థితిని మార్చేసిన ఈ వీడియో అంచనాలు అమాంతం పెంచేసింది.

బాలయ్యతో పాటు అన్నీ సరికొత్తగానే
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి రైతు పాత్ర కాగా, మరొకటి అఘోరా రోల్ అని అంటున్నారు. అలాగే, ఈ సినిమా కోసం బాలీవుడ్ విలన్ వస్తున్నాడట. అంతేకాదు, ఇందులో కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది.

BB3లో మరో హీరో.. బోయపాటి కోసం
తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... ఇందులో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడట. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కాసేపు కనిపించే ఈ పాత్ర కీలకంగా ఉంటుందని తెలిసింది. గతంలో బోయపాటితో అతడు ‘జయ జానకీ నాయక' అనే సినిమా చేశాడు. ఆ పరిచయంతోనే సదరు హీరోను ఒప్పించాడట మాస్ డైరెక్టర్.

సినిమాలోలో ఆ హీరోలు కూడా
నిజానికి ఈ సినిమాలో మరికొందరు హీరోలు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా అప్పటి హీరోలు రాజశేఖర్, జగపతిబాబు, శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నారని అన్నారు. ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి, నవీన్ చంద్ర, వేణు తొట్టెంపూడి సహా మరికొందరు కీలక పాత్రలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిలో దేనికీ క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











