Samantha Ruth Prabhu కి బిగ్ ఆఫర్... ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబుతో మరోసారి!
దక్షిణాది సూపర్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత సమంత కెరీర్ గ్రాఫ్ రివ్వున ఎగిరిపోతున్నది. నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత తన కెరీర్‌ను గట్టిగానే ప్లాన్ చేసుకొంటున్నది. బ్రేకప్ తర్వాత విహార యాత్రకు వెళ్లి వచ్చిన సమంత ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్పలో ఐటెమ్ సాంగ్‌లో నటించడానికి సిద్ధమైంది.
అలాగే RRR సినిమా తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే చిత్రంలో సమంత నటించనున్నారనే వార్తలు ఫిలింనగర్ చక్కర్లు కొడుతున్నది. తన తదుపరి చిత్రంలో సమంత రుత్ ప్రభు నటింపజేయాలని సంప్రదించగా అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గతంలో మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించగా అది బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో కూడా సమంత నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇలా సూపర్ హిట్ పెయిర్‌గా నిలిచిన సమంత, మహేష్ బాబు జంటను మళ్లీ రిపీట్ చేయాలని జక్కన్న నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా, సమంత బాలీవుడ్ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు. ప్రముఖ బ్యానర్‌లో రూపొందే హిందీ చిత్రంలో నటించడానికి దర్శక, నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది.
ఇక దర్శకుడు గుణశేఖర్ సొంత ప్రాజెక్ట్ శాకుంతలం చిత్రంలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. తొలిసారి సమంత ఓ పిరియాడిక్ ఫిలింలో నటిస్తున్నది. అది కాకుండా తమిళంలో విఘ్నేష్ శివన్ నిర్మించే కాతువాకుల రెండు కాదల్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం RRR చిత్ర రిలీజ్ విషయంలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. జనవరి 7వ తేదీన RRR సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











