సూపర్ స్టార్‌పై కన్నేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ ‘స్పిరిట్' తర్వాత అతనితోనే..
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సెన్సెషనల్ హిట్స్ తో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌తో మరోసారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంటెన్స్ ఎమోషన్స్, రా యాక్షన్, హీరో క్యారెక్టర్ డిజైన్‌లో న్యూ డైమెన్షన్ చూపించడంలో సందీప్ ను మించిన వారు లేదు. ఈ ప్రత్యేకత వల్ల ఆయనతో సినిమా చేయాలని అగ్ర హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తెరకెక్కిస్తుండగా, ఆ తర్వాత ఓ టాలీవుడ్ సూపర్‌స్టార్ తో సినిమా చేయబోతున్నారన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది అత్యంత పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా నిలవబోతోందని సమాచారం. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'స్పిరిట్' ఆడియో గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ మాస్ లుక్, ఇన్టెన్స్ డైలాగ్ డెలివరీ, సందీప్ మార్క్ రా టోన్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ రెడీ అవుతుండగా, మూడు నుంచి నాలుగు నెలల్లో ప్రధాన షూటింగ్ పూర్తి చేయాలని సందీప్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 2026లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలన్నదే మేకర్స్ లక్ష్యం.

ఇదిలావుండగా.. 'స్పిరిట్' తర్వాత సందీప్ రెడ్డి వంగా 'సూపర్‌స్టార్ మహేశ్ బాబు'తో సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమిక స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. మహేశ్ ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తవ్వడానికి కనీసం ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఆలోగా సందీప్ వంగా స్క్రిప్ట్‌ను పూర్తిగా రెడీ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. మహేశ్-సందీప్ వంగా ప్రాజెక్ట్‌కు 'డెవిల్' అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. ఆసక్తికరంగా, 2023లోనే సందీప్ వంగా మహేశ్ బాబుకు 'డెవిల్' అనే కథను వినిపించినట్టు, అది 'యానిమల్' కంటే కూడా ఎక్కువ ఇంటెన్సిటీతో ఉంటుందని, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తోంది. అప్పట్లో మహేశ్‌కు ఆ కథ నచ్చినప్పటికీ, డేట్స్ సమస్యల కారణంగా ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని సమాచారం. ఇప్పుడు మళ్లీ ఆ స్క్రిప్ట్ తెరపైకి రావడం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతోంది.
'డెవిల్' గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో, పూర్తిగా రా అండ్ అగ్రెసివ్ టోన్‌లో ఉండబోతుందన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ ఇమేజ్‌తో గుర్తింపు తెచ్చుకున్న మహేశ్ బాబు, సందీప్ వంగా స్టైల్‌లో ఒక డార్క్, ఇన్టెన్స్ పాత్రలో కనిపిస్తే అది టాలీవుడ్‌కు ఓ గేమ్‌చేంజర్‌గా మారుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు, ఎడిట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఈ కాంబినేషన్‌పై హైప్‌ను మరింత పెంచుతున్నాయి.
ఇక మరోవైపు, సందీప్ వంగా ఎప్పటినుంచో మహేశ్ బాబుతో సినిమా చేయాలన్న ఆసక్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. 2025లో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. "మహేశ్ సార్, మీరు నిజమైన సూపర్ స్టార్. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను" అని సందీప్ పేర్కొనడం ఈ ప్రాజెక్ట్‌పై నమ్మకాన్ని పెంచింది. అయితే, ఈ వార్తలన్నింటిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మహేశ్ బాబు టీమ్ కానీ, సందీప్ రెడ్డి వంగా కానీ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.
అయినప్పటికీ, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కాంబినేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని టాక్. 'స్పిరిట్' షూటింగ్ పూర్తయ్యాక మహేశ్ బాబు సినిమాపై సందీప్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారని, అన్నీ అనుకున్నట్టే జరిగితే త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











