చిరంజీవి లూసీఫర్‌లో యంగ్ హీరో: ఏపీ ముఖ్యమంత్రిగా కనిపించనున్న టాలెంటెడ్ స్టార్
రీఎంట్రీలో సూపర్ స్పీడు చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో ఆయన వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని చిత్రాలను ప్రకటించారు. అందులో మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసీఫర్' రీమేక్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది.
మోహన్ లాల్ లీడ్ రోల్‌లో.. హీరో పృథ్వీ రాజ్ తెరకెక్కించిన చిత్రం 'లూసీఫర్'. దీన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందించబోతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 'సాహో' ఫేం సుజిత్ తెరకెక్కించాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో అతడు తప్పుకున్నాడు. ఇప్పుడు అతడి స్థానంలో 'తని ఒరువన్' దర్శకుడు మోహన్ వచ్చి చేరాడు. ఇక, ఈ సినిమాలో అత్యంత కీలకమైన సీఎం పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్‌ను తీసుకున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం అతడు చిరంజీవితో దిగిన ఫొటోను షేర్ చేయడమే.

ప్రస్తుతం 'లూసీఫర్' తెలుగు రీమేక్‌పై స్క్రిప్ట్ వర్క్‌పై దృష్టి పెట్టిన డైరెక్టర్ మోహన్ రాజా.. అందులో చాలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, కాస్టింగ్ విషయంలోనూ ఓ క్లారిటీకి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మక చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న సత్యదేవ్ పేరును స్వయంగా మెగాస్టార్ చిరంజీవే సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్ రోల్‌ను కూడా క్రియేట్ చేస్తున్నారని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











