సంక్రాంతి పోరులో మరో ట్విస్ట్: అల, సరిలేరు నిర్మాతల రహస్య సమావేశం.. రిలీజ్ డేట్స్ ఛేంజ్.!
సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ మరో దానికి ఉండదు. ఈ పండుగ సమయంలోనే బడా సినిమాలు విడుదల అవుతుంటాయి. దాదాపు వారం రోజుల పాటు సెలవులు ఉండడంతో ఫిల్మ్ మేకర్లు ఆ సమయంలోనే తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు పోటీ పడుతుంటారు. ఇప్పటి వరకు సంక్రాంతి సీజన్‌లు జరిగిన దానికి భిన్నంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. దీనికి కారణం తెలుగులోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మహేశ్, అల్లు అర్జున్ సినిమాలు వస్తుండడమే. తాజాగా ఈ రెండు సినిమాల నిర్మాతలు రహస్య సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. అంతేకాదు, రెండు సినిమాల విడుదల తేదీలు కూడా మారాయని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.? వివరాల్లోకి వెళితే...

రెండు టీమ్‌లు మామూలుగా లేవు
రెండు సూపర్ హిట్ల తర్వాత మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అలాగే, అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..'. దీనిని అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

అందులో మాత్రం తగ్గకుండా వస్తున్నారు
ఈ రెండు సినిమాలు ఒక రోజు వ్యవధిలో సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను మొదలెట్టేశాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాల టీజర్లు, పాటలు విడుదలయ్యాయి. అలాగే, రెండు మూడు రోజుల్లో సినిమా ఫంక్షన్లు కూడా నిర్వహించనున్నారు. మొత్తానికి రెండు యూనిట్లు ప్రమోషన్ విషయంలో తగ్గడం లేదు.

అవే అంచనాలు పెంచేస్తున్నాయి
ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల నుంచి విడుదలైన ప్రతి టీజర్, పాటలు, పోస్టర్లు అన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కొన్ని పాటలకైతే రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. దీంతో ఈ రెండు సినిమాలపై అంచనాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఫ్యాన్స్ నుంచి కూడా సహాకారం ఉండడంతో ఇవి ట్రెండ్ అవుతున్నాయి.

మహేశ్‌కు ప్లస్.. అల రిలీజ్ డేట్ ఛేంజ్
మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో..' 12న విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్లు గతంలోనే ప్రకటించాయి. ఇలా అయితే సరిలేరుకు కొంత అడ్వాంటేజ్ ఉంటుందన్న టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. అల టీమ్ రిలీజ్ డేట్‌ను 12 నుంచి 10కి మార్చిందని ప్రచారం జరుగుతోంది.

నిర్మాతల రహస్య సమావేశం
‘అల.. వైకుంఠపురములో..' రిలీజ్ మారుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, దీనికి సంబంధించిన మరో వార్త తాజాగా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. రిలీజ్ డేట్ల విషయంలో రెండు సినిమాల నిర్మాతలు రహస్యంగా సమావేశం నిర్వహించారనేదే ఆ వార్త సారాంశం. ‘సరిలేరు' వైపు దిల్ రాజు, ‘అల' వైపు అల్లు అరవింద్ ఈ చర్చల్లో తమ డిమాండ్లు వినిపించారని టాక్.

సంక్రాంతి పోరులో మరో ట్విస్ట్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల విడుదల తేదీలు మారే అవకాశం ఉందట. సీక్రెట్ మీటింగ్‌లో వీళ్ల మధ్య కొన్ని ప్రతిపాదనలు నడిచినట్లు తెలిసింది. అందులో ఒకటి.. అల.. డేట్ మారితే, సరిలేరు కూడా 10నే విడుదల అవుతుంది. లేదా.. రెండు సినిమాలూ జనవరి 11న విడుదల చేయాలి. లేకుంటే ఇప్పుడున్నట్లే డిసైడ్ అవ్వాలని అనుకున్నారని సమాచారం.

ఇలా ఎప్పుడూ జరగలేదు
తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే సినిమాల విడుదలకు వారం రోజుల ముందు వరకూ రిలీజ్ డేట్లు ఫైనలైజ్ కాకపోవడం ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే బాక్సాఫీస్ మీద భారీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











