అనుష్క - క్రిష్ మూవీకి ఊహించని టైటిల్: ఓహో ఇది అలాంటి కథతో రాబోతుందా!
తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా హవాను చూపించిన వాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో అనుష్క శెట్టి ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది.. తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా వెండితెరపై సందడి చేయడం లేదని తెలిసిందే.
గత ఏడాది 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీతో వచ్చి హిట్ కొట్టిన అనుష్క శెట్టి.. ఇప్పుడు మలయాళంలో ఓ మూవీని చేస్తోంది. దీనితో పాటు ప్రస్తుతం ఈ చిన్నది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. గతంలో వీళ్ల కాంబోలో 'వేదం' వంటి మూవీ రావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి.

అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. కానీ, ఈ చిత్రం ఒడిశాలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాబోతుందని అంటున్నారు. ఓ ఘటన వల్ల అన్యాయానికి గురైన అమ్మాయిగా అనుష్క నటిస్తున్నట్లు తెలిసింది. ఆమె ఎలాంటి పోరాటం చేసిందనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నారట.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో షూట్‌ను జరుపుతున్నారని ఫిలిం నగర్ సమాచారం. దీని తర్వాత ఒడిశా వెళ్లి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ బయటకు వచ్చేసింది.

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి 'శీలవతి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు. ఈ టైటిల్ లీక్ అయిన తర్వాత ఈ సినిమా బలమైన పాయింట్ ఉన్న కథతోనే రాబోతుందని స్ఫష్టం అయింది. దీంతో దీనిపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. అనుష్క శెట్టి - క్రిష్ జాగర్లమూడి కలిసి చేస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











