శంకర్ ద్వారా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ!
హైదరాబాద్: స్టార్ దర్శకుడు శంకర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లదు. శంకర్ ఆలోచనలతో పాటు ఆయన సినిమాలు కూడా భారీగానే ఉంటాయి. చివరకు ఆయన సినిమా విడుదలైన తర్వాత కూడా భారీ కలెక్షన్లే సాధిస్తుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబును బాలీవుడ్‌కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాడట.
ప్రస్తుతం శంకర్ విక్రమ్ హీరోగా తమిళంలో 'ఐ' సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యాక ఇదే చిత్రాన్ని హిందీలో హృతిక్ రోషన్ చేస్తే బాగుంటుదని ప్లాన్ చేసాడు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న హృతిక్ శంకర్ అడిగిన డేట్స్ ఇవ్వలేనని చెప్పాడని, దీంతో శంకర్ కళ్లు తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుపై పడ్డాయని, మహేష్ బాబును బాలీవుడ్‌కు పరిచయం చేస్తూ 'ఐ' సినిమా హిందీలో చేసే ఆలోచనలో ఉన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ గాలి వార్తలే అని మహేష్ బాబు సన్నిహితులు అంటున్నారు. మహేష్ బాబుకు ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేసే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలే ఏమిటో త్వరలోనే తేల నుంది.
ఇక శంకర్-విక్రమ్ 'ఐ' సినిమా విషయానికొస్తే... ఈ చిత్రానికి పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'హారీపొటర్' చిత్రానికి పనిచేసిన ఆస్ట్రేలియన్ కంపెనీ స్పెషల్ ఎఫెక్ట్స్‌ని అందించనుంది.
'మెన్ ఇన్ బ్లాక్' చిత్రానికి పనిచేసిన మారీ ఓగ్ట్ ఈ చిత్రానికి కాస్టూమ్స్ డిజైనర్‌గా సేవలందించనున్నాడు. చైనాకు చెందిన ఫైట్‌మాస్టర్ పీటర్ మింగ్ ఈ చిత్రానికి పోరాట దృశ్యాలని సమకూర్చనున్నాడు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ రవి చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











