నిర్మాతతో వివాదం.. 40 కోట్లు కట్టాలంటూ స్టార్ హీరోకు డెడ్‌లైన్? ఏం జరిగిందంటే?
సినీ పరిశ్రమ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ నిర్మాత పరిస్ధితి బాలేదు. వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను అవలీలగా టచ్ చేస్తున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలే వెంటాడుతున్నాయి. పెరిగిపోయిన హీరోల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ ఇతర అంశాలు కలిసి సినిమాలు తీయాలంటేనే భయపడే పరిస్ధితులు నెలకొన్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సినిమాలను తీసినప్పటికీ దానిని థియేటర్ దాకా తీసుకెళ్లడం ఇంకా కష్టంగా మారింది. సెన్సార్ సర్టిఫికెట్‌తో పాటు మధ్యలో కాపిరైట్ వివాదాలతో ఎప్పుడు ఎవరో ఏ కేస్ వేస్తారోనని నిర్మాతలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
నిర్మాతలను దోపిడీ చేస్తోన్న హీరోలు
ఇలాంటి పరిస్ధితుల్లో నిర్మాతలను ఆదుకోవాల్సిందిపోయి.. వారిని మరిన్ని ఇబందులు పెడుతున్నారు కొందరు స్టార్ హీరోలు. సెట్‌లో సౌకర్యాలతో పాటు కుదిరనప్పుపడు షూటింగ్‌కు రావడం, లేదంటే అర్ధాంతరంగా క్యాన్సిల్ చేస్తున్నారు. మరికొందరైతే ఒకటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరిగిన తర్వాత సడెన్‌గా సినిమా నుంచి తప్పుకుంటున్నారు. దీంతో నిర్మాతల బాధ వర్ణనాతీతం. తాజాగా ఓ స్టార్ హీరో తన సినిమా నుంచి తప్పుకోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ నిర్మాత నష్ట నివారణ చర్యలకు దిగారు. ఈ వివరాల్లోకి వెళితే..

కాంతార సీన్‌తో వివాదం
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అది తన సినిమాలతో కావొచ్చు, వ్యక్తిగతంగా కావొచ్చు. ఏది ఏమైనా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం .. కన్నడ హిట్ మూవీ కాంతార ఛాప్టర్ 1లో ఓ దైవ సన్నివేశాన్ని ఇమిటేట్ చేసే క్రమంలో హేళన చేయడంతో ఆయనపై కన్నడిగులతో పాటు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. దీనిపై రణ్‌వీర్ సింగ్ స్వయంగా క్షమాపణులు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. దీనిపై కేసు నమోదవ్వగా.. ఏప్రిల్ 8న కోర్టులో విచారణ కూడా జరగనుందంటే పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
రణ్‌వీర్‌కు 3 వానిటీ వాన్‌లు
ఈ వివాదాల మధ్యలోను ధురంధర్ మూవీతో 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన రణ్‌వీర్.. ఈ సక్సెస్‌లో ఉండగానే ఆయనను మరో వివాదం చుట్టుముట్టింది. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆయన ఏకంగా మూడు వానిటీ వాన్లను నిర్మాతల నుంచి పొందినట్లుగా వార్తలు రావడంతో క్రిటిక్స్ భగ్గుమన్నారు. తనకు, తన స్టాఫ్‌కి, ఇతర అవసరాలకు మరొకటి చొప్పున మూడు కేరవాన్‌లను ఆయనను తెప్పించినట్లుగా ధురంధర్ ఎండ్ కార్డ్స్‌లో ఆధారాలు చూపిస్తున్నారు నెటిజన్లు. తాజాగా రణ్‌వీర్ సింగ్‌కు మరో షాక్ తగిలింది. ఏకంగా 40 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఓ స్టార్ ప్రొడ్యూసర్.. రణ్‌వీర్ సింగ్‌కి డెడ్‌లైన్ పెట్టినట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
డాన్ 3 నుంచి తప్పుకున్న రణ్‌వీర్
ఈ వివాదం పూర్వాపరాల్లోకి వెళితే.. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఫ్రాంఛైజీల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో హిట్ అయిన సినిమాలను వరుస పెట్టి సీక్వెల్స్‌గా తీస్తూ పోతున్నారు. ఈ క్రమంలోనే బ్లాక్‌బస్టర్ మూవీ డాన్‌కి సీక్వెల్‌గా గతంలో డాన్, డాన్ 2 వచ్చాయి. రణ్‌వీర్ సింగ్ హీరోగా డాన్ 3 తీయాలని నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ నిర్ణయించారు. ఈ మేరకు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ 2023లోనే ఈ మేరకు ప్రకటించి 2025లో రిలీజ్ అవుతుందని తెలిపింది. దాదాపు మూడేళ్లు కావొస్తున్నా డాన్ 3 పట్టాలెక్కలేదు. సరిగ్గా ఇదే సమయంలో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం బాలీవుడ్‌లో వివాదాస్పదమైంది.
40 కోట్లు కట్టండి
డాన్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులను ఫర్హాన్ అక్తర్ పూర్తి చేశారు. స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, నటీనటుల ఎంపిక, షెడ్యూల్స్, లోకేషన్స్ ఎంపిక, ఇతర ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రణ్‌వీర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో రణ్‌వీర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. దాంతో నిర్మాత ఫర్హాన్ అక్తర్ నష్ట నివారణ చర్యలకు దిగారు. సినిమా నుంచి హీరో తప్పుకోవడంతో ఆయనను నమ్ముకుని ఇంతకాలం పెట్టిన ఖర్చు వృథా అయ్యిందని ఫర్హాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా నిలిపివేసినందుకు రణ్‌వీర్ తమకు 40 కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బీటౌన్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే రణ్‌వీర్, ఫర్హాన్‌లు స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











