నిజమా...బాలకృష్ణ తగ్గుతున్నాడా?
హైదరాబాద్ : సిక్స్ ప్యాక్,ఎయిట్ ప్యాక్ అంటూ కుర్ర హీరోలు దున్నేస్తున్నారు. వారికి కౌంటర్ ఇవ్వటానికి బాలకృష్ణ స్లిమ్ లుక్ తో సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన 15 కేజీలు వరకూ తగ్గాలని ప్లాన్ చేసి ఆ దిసగా వర్కవుట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన డైట్, నిపుణుల పర్యవేక్షణలో ఎక్సరసైజ్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా ఎవరి కోసం... కోన వెంకట్ రాసిన కథ కోసం అని తెలుస్తోంది.
కోన వెంకట్, గోపీ మోహన్ చెప్పిన కథలో బాలకృష్ణ..మాఫియా డాన్ గా కనపడతారని చెప్పుకుంటున్నారు. కామెడీ,ఎంటర్టైన్మెంట్ కలిపిన ఈ కథ బాలకృష్ణ ఇప్పటిదాకా చేసిన కథలకు డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నారు.
ఇటీవల ‘లెజెండ్' సినిమా విజయంతో మంచి జోరుమీదున్న బాలయ్య అటు పొలిటికల్‌గా కూడా అంతే జోరును ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. ఇదిలా వుండగా తన 99వ చిత్రానికి సన్నాహాలు ప్రారంభించాడు బాలకృష్ణ. ఇటీవలే గోపీచంద్‌తో ‘లౌక్యం' చిత్రాన్ని రూపొందించిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది.

ఇప్పటికే కథా చర్చలు జరుపుకున్న ఈ చిత్రానికి బాలకృష్ణ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌లు కలిసి పనిచేస్తారని, వారు బాలకృష్ణతో పనిచేయడం ఇదే ప్రథమం. బాలయ్యతో మంచి హిట్ చిత్రాలని నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానున్నట్లు తెలిసింది.
షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం విషయాలకి వస్తే..
ధర్మం ఎప్పుడూ ఒంటరికాదు. దానిని కాపాడ్డానికి ఎవరో ఒకరు శ్రమిస్తూనే ఉంటారు. ధర్మాన్ని నిలబెట్టి, న్యాయాన్ని రక్షించి, అవినీతిపై యుద్ధం చేసిన పౌరుడి కథే మా సినిమా అంటున్నారు సత్యదేవా. ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడు. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు.
రుద్రపాటి రమణారావు నిర్మాత. అరకులో చిత్రీకరణ జరుగుతోంది. రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో వారం రోజుల పాటు అరకులోనే చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
''లెజెండ్'తో బాలకృష్ణ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అందుకు ఏమాత్రం తగ్గదు. మణిశర్మ స్వరపరిచిన గీతాలు అందరినీ అలరిస్తాయ''న్నారు. ఈ చిత్రం కోసం 'వారియర్', 'లయన్' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











