శోభిత ధూళిపాల ప్రెగ్నెన్సీ.. చైతూ తండ్రి కాబోతున్నాడా? నాగార్జున క్లారిటీ
అక్కినేని కుటుంబం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో బిగ్ ఫ్యామిలీగా పేరొందిన అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త రాబోతోందా? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ప్రెగ్నెంట్ అన్న వార్తలు, మరోవైపు అఖిల్ భార్య జైనబ్ రవ్జీ కూడా తల్లి కాబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున చేసిన తాజా వ్యాఖ్యలు ఈ రూమర్స్‌కు మరింత ఊతమిచ్చినట్టు అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?
నాగచైతన్య టాలీవుడ్‌లోకి 'జోష్' సినిమాతో హీరోగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 'ఏం మాయ చేసావే'తో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. అదే సినిమా ద్వారా సమంతతో ప్రేమలో పడ్డ చైతూ, 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాలతో ఈ జంట 2021లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న నాగచైతన్య, గతేడాది డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి చాలా సింపుల్‌గా కుటుంబ సభ్యులు,సన్నిహితుల మధ్య జరిగింది.

ఇక పెళ్లి తర్వాత నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా మారారు. ఇటీవలే హానీమూన్ ట్రిప్‌కి వెళ్లినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ శోభిత ప్రెగ్నెంట్ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె ఇటీవల కనిపించిన ఫొటోలు చూసిన నెటిజన్లు ' అక్కినేనీ బుల్లి వారసుడు రాబోతున్నాడా?' అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రూమర్స్ రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై నాగచైతన్య గానీ, శోభిత గానీ అధికారికంగా స్పందించలేదు.
ఇక మరోవైపు నాగార్జున రెండో తనయుడు అక్కినేని అఖిల్ కూడా ఇటీవలే తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్నాడు. జూన్ నెలలో జరిగిన ఈ పెళ్లి కూడా చాలా గ్రాండ్‌గా కాకుండా కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట వెకేషన్ ట్రిప్స్‌కు వెళ్లడం, ఎయిర్‌పోర్ట్‌లలో మీడియాకు కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే జైనబ్ రవ్జీ ప్రెగ్నెంట్ అన్న వార్తలు కూడా బయటికొచ్చాయి. అఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడన్న ప్రచారం మొదలైంది. కానీ ఈ విషయాన్ని కూడా అక్కినేని కుటుంబం ఇప్పటివరకు ధృవీకరించలేదు.
ఇలాంటి సమయంలో కింగ్ నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ ఓ మీడియా ప్రతినిధి, 'మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారా? సోషల్ మీడియాలో అలాంటి వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా?'అని ప్రశ్నించాడు. దీనికి నాగార్జున నవ్వుతూ.. ' సరైన సమయం వచ్చినప్పుడు నేను మీకే తెలియజేస్తాను'అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అన్ లైన్ లో చర్చకు దారితీశాయి. ఈ వార్తలను నేరుగా ఖండించకపోవడం, అదే సమయంలో కన్ఫర్మ్ కూడా చేయకపోవడం వల్ల ఆ రూమర్స్‌కు మరింత ఊతం ఇచ్చినట్టు అయింది.
దీంతో నిజంగానే శోభిత ధూళిపాళ ప్రెగ్నెంట్‌నా? నాగచైతన్య తండ్రి కాబోతున్నాడా? లేక అఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడా? అక్కినేని ఇంట మరోసారి చిన్నారి సందడి చేయబోతుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే భావించాలి. నాగార్జున చెప్పినట్టుగా 'సరైన సమయం' ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











