అఖిల్ నెక్స్ట్ మూవీ ప్లాప్ డైరెక్టర్‌తో.. నాగ్ ఒప్పుకుంటాడా!
అక్కినేని యువ వారసుడు అఖిల్ హిట్ మూవీ కల వాయిదా పడుతూనే ఉంది. తొలి చిత్రం నుంచి అఖిల్ హిట్ కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నాడు. కానీ విజయం వరించడం లేదు. అఖిల్ చిత్రంతో అక్కినేని హీరో టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తొలి సినిమా విషయంలో సరైన ప్లానింగ్ లేక తనకు సూట్ కానీ కథతో అఖిల్ బోల్తా కొట్టాడు. ఆ తర్వాత హలో చిత్రంతో ప్రేమ కథ ట్రై చేసిన ఫలితం ఇవ్వలేదు. ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నించిన మిస్టర్ మజ్ను చిత్ర పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. కాగా అఖిల్ నాల్గవ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

మిస్టర్ మజ్ను కూడా
యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ దర్శకుడు అంతుకు ముందు తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ చిత్రం తెరకెక్కించి ఉండడంతో ఈ సారి అఖిల్ హిట్ కొట్టడం ఖాయం అని అంతా భావించారు. కానీ మిస్టర్ మజ్ను చిత్ర బాక్సాఫీస్ రన్ నిరాశపరిచే దిశగా సాగుతోంది. దీనితో హిట్ అందుకోవాలనే అఖిల్ కల మరోమారు వాయిదా పడింది. మిస్టర్ మజ్ను చిత్రం తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో పనిచేస్తాడనే ఆసక్తి సాధారణంగానే పెరుగుతుంది.

నటనలో పరిణితి
అఖిల్ ఈ చిత్రంలో నాటీ బాయ్ గా మాత్రమే కాదు.. ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణితి చెందిననటనతో కూడా అదరగొట్టాడు. ఈ చిత్రంలో అఖిల్ లో చాలా మార్పు కనిపించింది. కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేక పోయింది. అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి అక్కినేని అభిమానులు షాక్ కి గురయ్యే న్యూస్ వినిపిస్తోంది. అఖిల్ తదుపరి చిత్ర దర్శకుడిగా శ్రీను వైట్ల పేరు వినిపిస్తోంది.

వరుస ప్లాపులు
అఖిల్ కు అర్జెంట్ గా ఓ హిట్ పడాలి. అఖిల్ లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగేందుకు అతడికి ఓ విజయం అవసరం. ఇప్పటికే వరుసగా మూడు చిత్రాలు నిరాశపరిచాయి. ఇంతకు మించి ప్లాపులు పడడం మంచిది కాదు. ఇలాంటి తరుణంలో కొత్త చిత్రం విషయంలో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంటుంది. కానీ శ్రీను వైట్ల అఖిల్ నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడనే ప్రచారం అక్కినేని అభిమానులని కలవర పెడుతోంది. శ్రీను వైట్ల ప్రస్తుతం ఏమాత్రం ఫామ్ లో లేని దర్శకుడు.

నాగ్ ఒప్పుకుంటాడా
శ్రీనువైట్ల అగడూ చిత్రానికి ముందు వరకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. కానీ ఆగడు నుంచి ఈ దర్శకుడికి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. కొంత గ్యాప్ తీసుకుని రవితేజతో చేసిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తరుణంలో అఖిల్, శ్రీనువైట్ల కాంబోకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది ప్రశ్నగామారింది. నాగార్జునతో శ్రీనువైట్ల కింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అఖిల్ తో తాను ఓ చిత్రాన్ని చేస్తానని శ్రీనువైట్ల తెలిపాడు. అఖిల్ కోసం కథ కూడా సిద్ధం చేసుకున్నాడట.


Click it and Unblock the Notifications











