రాజమౌళి,ప్రభాస్ చిత్రం టైటిల్ ఇదేనా?
హైదరాబాద్ : ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి ఏ టైటిల్ పెట్టనున్నారు అనేది ఇప్పుడు పరిశ్రమవర్గాల్లోనే కాక,అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇదొక పూర్తిస్థాయి జానపదం చిత్రమని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పేరు 'బాహుబలి' అని తెలుస్తోంది. అదే టైటిల్ గా పెట్టే అవకాసం ఉందని చెప్తున్నారు. బాహుబలినే వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం.
ఈ చిత్రంలో ప్రభాస్, రానా కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఇందులో అన్నదమ్ములుగా, బద్దశత్రువులుగా కనిపించబోతున్నారని వినికిడి. రాజకీయ మంత్రాంగాలు, ఊహకందని పరిణామాలు ఈ కథలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని సమాచారం. అనుష్క పాత్ర ఈ కథలో కేంద్ర బిందువుగా నిలుస్తుందని చెప్తున్నారు. దాదాపు వంద కోట్ల భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్ పని చేయబోతున్నారు. సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.
ఇక ఈ చిత్రం గురించి నిర్మాత దేవినేని ప్రసాద్ మాట్లాడుతూ... "ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మా ఆర్కా మీడియా సంస్థ ఇటు సినిమా రంగంలోనూ, అటు టీవీ రంగంలోనూ ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు. ఆర్కా మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ సంస్థపై దేవినేని ప్రసాద్, శోభు యార్లగడ్డ గతంలో 'వేదం', 'మర్యాదరామన్న' చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











