మహేశ్ బాబు కోసం రాజమౌళి డేరింగ్ స్టెప్: స్టోరీ విషయంలో ప్లాన్ మార్చేసి.. స్వయంగా రంగంలోకి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లను ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తుంటారు. ఫలానా వాళ్ల కలయికలో సినిమాలు వస్తే చూడాలని చాలా మంది కోరకుంటూ ఉంటారు. అలాంటి కాంబోలో టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా చాలా కాలంగా అందరూ కోరుకుంటోన్న కలయికల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఒకటి. సుదీర్ఘమైన నిరీక్షణకు తెరదించుతూ వీళ్లిద్దరూ ఓ సినిమా కోసం జట్టుకడుతున్నారు. ఇప్పటికే దీనిపై అటు రాజమౌళి.. ఇటు మహేశ్ బాబు ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులు మీకోసం!

మహేశ్ బాబు అది.. రాజమౌళి ఇది
కొంత కాలంగా వరుసగా హిట్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, రాజమౌళి ఇప్పుడు RRRను తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ రేంజ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది.

మహేశ్‌తో సినిమా ప్రకటించాడుగా
దేశమే గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిపోయిన రాజమౌళి తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేస్తున్నట్లు గత ఏడాదే ప్రకటించాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారని కూడా పేర్కొన్నాడు. అయితే, ఈ సినిమా నేపథ్యం గురించి మాత్రం ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఎన్నో పుకార్లు పుట్టుకొస్తున్నాయి. మొత్తానికి దీనిపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

తండ్రికి ఆ బాధ్యతలు అప్పగించి
మోస్ట్ వెయిటెడ్ కాంబో కావడంతో ఈ ప్రాజెక్టుపై అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా కథను తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీని బాధ్యతను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఆయన చాలా రోజులుగా ఈ మూవీ కథపై వర్క్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఆ మధ్య తెలిపాడు.

సినిమా కథపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చి
మహేశ్.. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టు గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని.. రాజుల కాలం నాటి స్టోరీతో వస్తుందని.. అడ్వెంచర్ కథతో తెరకెక్కుతుందని ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వీళ్లిద్దరి సినిమా ఆలస్యం.. అందుకే
నిజానికి మహేశ్ బాబు.. రాజమౌళి కలయికలో రాబోతున్న సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి సూచన మేరకు మహేశ్ బాబు.. త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడని అంటున్నారు. ఇది పూర్తయ్యాకే అది మొదలవుతుందట.

మహేశ్ కోసం రాజమౌళి ప్లాన్ ఛేంజ్
RRR మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. బ్యాలెన్స్ వర్క్‌ను సైతం ఇటీవలే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీంతో ఈ మూవీ అనుకున్న సమయానికంటే ముందుగానే విడుదలకు రెడీ అవబోతుందని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కోసం రాజమౌళి ప్లాన్ మార్చాడని తెలుస్తోంది.

స్వయంగా రంగంలోకి దిగిన జక్కన్న
మహేశ్ బాబుతో చేయబోయే సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసే బాధ్యతను విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ స్టోరీని రాజమౌళినే స్వయంగా రాస్తున్నట్లు తెలుస్తోంది. RRR మూవీ దాదాపుగా పూర్తవడంతో తండ్రి తయారు చేసిన స్క్రిప్టును స్వయంగా మార్పులు చేస్తూ రాస్తున్నాడట. ఇది తన పాత చిత్రాలను తలదన్నేలా రెడీ చేస్తున్నాడట ఈ స్టార్ డైరెక్టర్.


Click it and Unblock the Notifications











