విక్రమ్ కుమార్ భారీ ప్రయోగం.. అల్లు అర్జున్ తొలిసారి అలాంటి సినిమా, తికమక అందుకే!
నా పేరు సూర్య చిత్రం విడుదలై నెలలు గడచిపోతున్నాయి. ఎప్పుడూ సినిమాల విషయంలో స్పీడుగా ఉండే బన్నీ ఈ సారి ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నాడు. దానికి కారణం నా పేరు సూర్య చిత్రం పరాజయం చెందడమే. నా పేరు సూర్య చిత్ర ఫాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి చిత్రం విషయంలో పక్కా ప్లాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాలని బన్నీ భావిస్తున్నాడు. అందుకే తనకు సరిపోయే కథని ఎంచుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. విక్రమ్ కుమార్ తో నెక్స్ట్ మూవీ అంటూ వార్తలు వస్తున్నా ఇంతవరకు ఖరారు కాలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించి ఆసక్తికర ప్రచారం మొదలైంది.

విభిన్నంగా
దర్శకుడు విక్రమ్ కుమార్ చిత్రాలన్నీ ప్రస్తుతం తెరకెక్కుతున్న కమర్షియల్ చిత్రాల శైలికి దూరంగా, విభిన్నంగా ఉంటాయి. అందుకే విక్రమ్ కుమార్ తక్కువ సమయంలో ప్రతిభ గల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన మనం, 24 చిత్రాలు అదే కోవలోకి వస్తాయి.

భారీ బడ్జెట్
విక్రమ్ కుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఓ విభిన్నమైన కథని విక్రమ్ కుమార్ బన్నీ వివరించాడట. బడ్జెట్ ఎక్కువగా ఉండడం, సెకండ్ హాఫ్ విషయంలో బన్నీ సంతృప్తి చెందక పోవడంతో ఆ చర్చలు అలాగే కొనసాగుతున్నాయి.

పునర్జన్మల నేపథ్యంలో
విక్రమ్ కుమార్ వినిపించక కథ పునర్జన్మల నేపథ్యంలో సాగుతుందట. విభిన్నమైన కథ కావడంతో బన్నీ వెంటనే ఓకె చెప్పలేక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓకె అయితే పునర్జన్మల నేపథ్యంలో బన్నీ చేయబోతున్న తొలి చిత్రం అవుతుంది.

చర్చలు కొలిక్కి
ప్రస్తుతం బన్నీ, విక్రమ్ కుమార్ మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ సూచించినట్లుగా విక్రమ్ కుమార్ సెకండ్ హాఫ్ లో మార్పులు చేశాడని సమాచారం. ఇటీవల గీత గోవిందం సక్సెస్ మీట్ లో కూడా విక్రమ్ కుమార్ మెరవడంతో బన్నీతో సినిమా ఖాయం అయిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏది ఏమైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











