సుకుమార్-చెర్రీ అదిరిపోయే ప్లాన్.. నిజంగా వర్కౌట్ అవుతుందా?.. జోరుగా చర్చలు
మరోసారి రామ్ చరణ్-సుకుమార్ కలిశారంటే ఆ అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. ఎందుకంటే వారి కాంబోలో వచ్చిన రంగస్థలం సృష్టించిన మాయ అలాంటిది. రంగస్థలం వచ్చి రెండేళ్లైనా దాని ప్రభావంలోంచి ఎవ్వరూ రాలేకపోతోన్నారంటేనే దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మళ్లీ వీరిద్దరు కలిసి రాబోతోన్నారు. అయితే ఈ సారి మాత్రం హీరో దర్శకుడిగా కాదండోయ్. ఈ ఇద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించబోతోన్నట్టు తెలుస్తోంది. వాటికి సంబంధించిన ఆసక్తికర విషయాలెన్నోబయటకు వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

నిర్మాతగా ఇద్దరూ బిజీనే..
రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్‌తో బడా చిత్రాలను నిర్మిస్తూ ఉంటే.. సుకుమార్ రైటింగ్స్ అంటూ కథ, కథనాలు అందిస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు సుకుమార్. అయితే వీరిద్దరూ, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సంస్థ అమెజాన్ కలిసి ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ఫిక్స్ అయ్యారట.

కథతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ..
ఆ వెబ్ సిరీస్‌కు స్క్రిప్ట్‌ను అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా సుకుమార్ చేయబోతున్నాడట. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్‌తో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇదే నిజమైతే తెలుగులో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌గా రికార్డులు క్రియేట్ చేస్తుంది.

రంగస్థలం, పుష్ప స్టైల్లోనే..
రంగస్థలం, పుష్ప స్టైల్లోనే ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందని టాక్. రా లుక్స్, సహజత్వానికి దగ్గరగా పూర్తి స్థాయి ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే పుష్పకు కొనసాగింపుగా ఉంటుందని తెలుస్తోంది. వీటిని సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని ఇరువురు భావిస్తున్నారట. అయితే ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

లాక్ డౌన్‌లో పనులు..
ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయాన్ని సుకుమార్ బాగానే వాడుకుంటున్నట్టు తెలుస్తోంది. దొరికిన ఈ టైమ్‌ను పుష్ప కోసం వినియోగిస్తున్నాడట. ఇంకా స్క్రిప్ట్‌ను చెక్కడం, క్యాస్టూమ్స్ డిజైన్ చేయించడం ఇలా ప్రొడక్షన్‌కు సంబంధించిన పనులను చేయిస్తున్నాడట. మరో వైపు వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రణాళిక కూడా సిద్దం చేస్తున్నాడట.


Click it and Unblock the Notifications











