ఎన్టీఆర్ చేతులెత్తేయడంతో సుకుమార్ సతమతం? బన్నీ భరోసాతో...
మహేష్ బాబుతో సినిమా చేస్తాడు అనుకున్న సుకుమార్ ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్‌తో సినిమా ప్రకటించేసి ఆశ్చర్య పరిచాడు. ఉన్నట్టుండి సుకుమార్ నిర్ణయం మార్చుకోవడానికి కారణం ఏమిటి? మహేష్ బాబుతో సినిమా ఎందుకు రద్దు చేసుకున్నాడనేది ఎవరికీ అర్థం కాలేదు. అల్లు అర్జున్-సుకుమార్ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే మహేష్ బాబు నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. ఇద్దరి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే తాము సినిమా చేయడం లేదని స్పష్టం చేశారు.

సుకుమార్ కాంప్రమైజ్ అయ్యేరకం కాదు...
సుకుమార్ తన సినిమా కథ కోసం చాలా సమయం వెచ్చిస్తాడు. ఒక్కోసారి రాత్రింభవళ్లు నిద్రాహారాలు మాని తనలోని రచయిత సంతృప్తి పడే వరకు కష్టపడతాడు. ఒక్కసారి అతడు కథను లాక్ చేసుకున్న తర్వాత ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అయ్యేరకం కాదు. మహేష్ బాబు కోసం రాసుకున్న కథ విషయంలో అదే జరిగిందట. స్క్రిప్టు విషయంలో మహేష్ బాబుకు కొన్ని అభ్యంతరాలు ఉండటంతో సుకుమార్ నిర్మొహమాటంగా తాను రాసుకున్న దానికి కట్టుబడి ఉంటానని చెప్పేశాడట. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడం ప్రాజెక్ట్ రద్దయింది.

లేటవుతుందనే ఆందోళన ఒక వైపు..
అయితే ‘రంగస్థలం' తర్వాత సుకుమార్ నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. మహేష్ బాబుతో మొదలవుతుందనుకున్న ప్రాజుక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒత్తిడి పెరగడంతో సుకుమార్ కాస్త ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ చేతులెత్తేశారా?
మహేష్ బాబుతో ప్రాజెక్ట్ వర్కౌట్ కాకపోవడంతో సుకుమార్ తనకు సన్నిహితుడైన జూ ఎన్టీఆర్‌ను సంప్రదించారని, తనతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ‘ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడూ పూర్తవుతుందో క్లారిటీ లేని జూ ఎన్టీఆర్... ఈ పరిస్థితుల్లో తాను ఎలాంటి హామీ ఇవ్వబోనని చేతులెత్తేశాడట.

సకుమార్ సతమతం...
ఇటు మహేష్ బాబు ప్రాజెక్ట్ రద్దు కావడం, అటు తారక్ కూడా బిజీగా ఉండి హామీ ఇవ్వక పోవడంతో సుకుమార్ కాస్త ఆందోళనకు అయినట్లు తెలుస్తోంది. అయితే చివరకు బన్నీని కలిసిన తర్వాత, అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత కూల్ అయినట్లు సమాచారం.

సుకుమార్ చెప్పిన లైనుకు బన్నీ సంతృప్తి
సుకుమార్ చెప్పిన లైనుకు బన్నీ కనెక్ట్ అయ్యారని, తన 20వ సినిమా మీతోనే చేస్తారని మాట ఇవ్వడంతో బన్నీ-సుకుమార్-మైత్రి మూవీ మేకర్స్ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చింది.


Click it and Unblock the Notifications











