సూర్యకాంతం ఏడ్వటానికి కారణం ఏంటి?
'సూర్యకాంతం" ఈ పేరు పెట్టుకోవడానికి గానీ, ఈ పేరుతో పిలిపించుకోవడానికి గానీ ఎవరూ ఇష్టపడరు. తెలుగు వారిని అంతగా బయపెట్టిన పేరు అది. నటిగా ఆ స్థాయి ముద్రను వేసిన మహానటి ఇండియాలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆమె తెలుగువారికి మాత్రమే దక్కిన వరం. సూర్యకాంతం అంటే కేవలం గయ్యాళి పాత్రలే కాదు. నటిగా ఆమెలో ఎన్నో కోణాలున్నాయి. సాత్వికమైన పాత్ర చేసినా, హాస్య పాత్రలో నటించినా, ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది కానీ సూర్యకాంతం కనిపించరు. అది ఆ మహానటి ప్రత్యేకత.
తెరపై ఎంత గయ్యాళిగా కనిపిస్తారో నిజజీవితంలో సాత్వికురాలమె. చిన్న పిల్లల మనస్థత్వం ఆమెది. ఆమె ఏదైనా పాత్ర చేస్తున్నప్పుడు తానే ఆ పాత్రగా మారిపోతారు. ఇక్కడ అదే జరిగింది ఆ రోజుల్లో మహానటుడు చిత్తూరు నాగయ్యగారి కాంబినేషన్ లో నటిస్తున్నారు ఆమె. ఒక సందర్భంలో సన్నివేశం ప్రకారం నాగయ్యగారిని తిట్టాలి. దర్శకుడు 'యాక్షన్" అన్నారు. అంతే ఇక సూర్యకాంతం నట విశ్వరూపం చూపించడం మొదలు పెట్టారు. తనదైన శైలిలో నాగయ్యగారిని సూటిపోటి మాటలంటూ పాత్రలో లీనమైపోయారు. నాగయ్య కూడా అందుకు తగినట్లే అద్భుతంగా ఆ సన్నివేశాన్ని రక్తికట్టించారు. దర్శకుడు ఓకే చెప్పగానే షూటింగ్ వాతావరణం అంతా కరతాళధ్వనులతో నిండిపోయింది. అంతే సూర్యకాంతం అమాంతంగా నాగయ్యగారి కాళ్ల మీద పడి ఏడ్వటం ప్రారంభించారు. నాగయ్య ఏంటమ్మా ఎందుకు ఏడ్వటం" అన్నారు నెమ్మదిగా 'లేదన్నయ్యా పాపిష్టిదాన్ని మిమ్మల్ని ఇష్టమొచ్చినట్లు తిట్టాను...పాత్ర కోసం చేయక తప్పలేదు క్షమించండన్నయ్యా" అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇవన్నీ తప్పవు. లే కళ్లు తుడుచుకో అన్నారు నాగయ్య చిరునవ్వుతో ఆ క్షణం యూనిట్ లో ఉన్న వారందరికీ కళ్లు చెమర్చాయట. ఆ ఒక్క సంఘటనను బట్టి ఆమెది ఎంత గొప్ప మనసో అర్థం చేసుకోవచ్చు. కళాకారుల మనసు సున్నితంగా ఉంటుంది అనడానికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ.


Click it and Unblock the Notifications











