హీరోగా టబు కుమారుడు? లెజెండరీ నటుడి బయోపిక్‌తో బాలీవుడ్ ఎంట్రీ!
డాక్టర్ కొడుకు డాక్టర్ అయిన చందంగానే.. సినీరంగంలో ఉన్న వారు కూడా తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు తమ వారసులను రంగంలోకి దించారు. వీరిలో కొందరు సక్సెస్ అయి ఇండస్ట్రీలో స్థిరపడగా.. మరికొందరు మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. ప్రతిభే ఎవరికైనా కొలమానం.. ప్రతిభ ఉన్నవారిని ప్రజలే అందలం ఎక్కిస్తారన్న సూత్రం ప్రకారం తమ పిల్లలను తీసుకొస్తున్నారు. తాజాగా అలనాటి అగ్రనటి టబు తన నటవారసుడిని పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
90వ దశకంలో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపు ఊపారు టబు. తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేశారు టబు. హైదరాబాద్‌కు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి టబు. ఆమె అసలు పేరు తబుస్సమ్ హష్మీ. తెలుగు నేల నుంచి వెళ్లి బాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేసి అగ్రనటిగా ఆమె స్థానం దక్కించుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీకి టబు స్వయానా మేనకోడలు. టబు చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు.

తొలుత బజార్ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఆమె .. అనంతరం హమ్ నే జవాన్‌లో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. కూలీ నెంబర్ 1తో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన టబు... తన అందాలతో పిచ్చెక్కిచ్చింది. అనంతరం సిసింద్రీ, నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగతీ, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైన ఆమె.. వయసు పెరగడంతో తన ఇమేజ్‌కు తగిన పాత్రలనే చేస్తున్నారు.
దాదాపు 16 ఏళ్ల తర్వాత తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన టబు.. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్‌కి తల్లిగా నటించారు. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, మరాఠీలతో పాటు హనుమాన్, ది నేమ్‌సెక్, లైఫ్ ఆఫ్ పై వంటి ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుతో పాటు సినీ రంగానికి అందించిన సేవలకు గాను 2011లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కుతోన్న స్లమ్‌డాగ్ మూవీలో టబు కీలకపాత్ర పోషిస్తున్నారు. 55 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయారు టబు. 50 క్రాస్ చేసినా ఇప్పటికీ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తున్నారు.
టబు త్వరలో తన నట వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లానింగ్‌లో ఉన్నారు. టబుది బలమైన సినీ నేపథ్యమున్న కుటుంబం అన్న సంగతి తెలిసిందే. తొలుత షబానా అజ్మీ, ఆ తర్వాత టబు సోదరి ఫరా నాజ్, అనంతరం టబులు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకలుగా వెలుగొందారు. టబు తన సోదరి ఫరా నాజ్ కుమారుడు ఫతే రంధవాను త్వరలోనే హీరోగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు. 1980వ దశకంలో బాలీవుడ్‌లో అగ్రనటిగా వెలుగొందిన ఫరా నాజ్.. ఆ తర్వాత విందు దారా సింగ్‌ను పెళ్లాడారు. వివాహం తర్వాత కుటుంబం కోసం తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఫరా నాజ్.. తన భర్త, కుమారుడితో కలిసి ముంబైలోనే నివసించారు. అయితే 2002లో విందు దారా సింగ్ - ఫరా నాజ్‌లు విడాకులు తీసుకున్నారు. అనంతరం దిన ఉమరోవాను విందు పెళ్లి చేసుకున్నారు.
తన కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న ఫతే కోసం అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నారు టబు. సోదరి కుమారుడే అయినా చిన్నప్పటి నుంచి ఫతే బాగోగులన్నీ టబునే చూసుకున్నారు. అటు ఫతే కూడా చిన్నమ్మతోనే క్లోజ్‌గా ఉండేవాడట. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో నటుడిగా మారాలనుకున్న ఫతే రంధవా.. ఇప్పటికే నటనలో మెళకువలతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు. ఈ క్రమంలోనే ఫతే కోసం మంచి స్క్రిప్ట్, దర్శకుడు, నిర్మాణ సంస్థను సెట్ చేసే పనిలో ఉన్నారు టబు. ఇందుకోసం తన పరిచయాలు, అనుభవం అన్నీ వాడుతున్నారట. అయితే ఫతే తాతగారు లెజెండరీ నటుడు, రెజ్లర్ దారా సింగ్. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ ద్వారా ఫతేను ఇంట్రడ్యూస్ చేయాలని టబు భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదకే వెళ్లే అవకాశం ఉంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications