ఆ స్టార్ హీరోకి రాజ్యసభ సీటు?.. సీఎం సన్నిహితుడితో టచ్‌లోకి.!
భారతదేశంలో సినిమాలు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. హీరోలు రాజకీయ నాయకులుగా మారి రాష్ట్రాలనే పాలించిన చరిత్ర మనది. ఇప్పటికీ ఎంతో మంది సినీతారలు వివిధ రాజకీయ పార్టీల్లో చేరడమో లేదంటే సొంతంగా పార్టీ పెట్టో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో సక్సెస్ అయినవారు కొందరే. తమ అవసరాల దృష్ట్యా కొందరు స్టార్స్ వెంట రాజకీయ పార్టీలు పరుగులు తీస్తుంటాయి.
భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఒకరు. నటనకే కొత్త భాష్యం చెప్పిన ఈ విలక్షణ నటుడు.. దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్‌గా భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు కమల్ . ఆయన టచ్ చేయని జోనర్ కానీ, వేయని గెటప్ కానీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆరేళ్ల వయసులో 1960లో కలతూర్ కన్నమ్మ సినిమా ద్వారా కమల్ హాసన్ సినీ రంగ ప్రవేశం చేసి తొలి సినిమాతోనే రాష్ట్రపతి అవార్డ్‌ని అందుకున్నారు.

1974లో కన్యాకుమారి అనే మలయాళ చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు కమల్ హాసన్. 60 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ సినిమాల్లో దాదాపు 230 చిత్రాలలో నటించారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా పరుగులు తీస్తున్నారు కమల్ హాసన్. వరుస ఫ్లాపులతో కెరీర్ అయిపోయిందని అనుకుంటున్న దశలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్‌తో ఆయన సాలీడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కల్కి 2, ఇండియన్ 3, థగ్ లైఫ్, విక్రమ్ 2, కేహెచ్ 233 ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి.
తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో పాటు కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల మరణంతో సైలెంట్ అయిన తమిళ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీని పెట్టి తన వాడి వేడి విమర్శలతో ఆకట్టుకున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న ఆయన సైలెంట్ అయ్యారు. నాటి నుంచి తన సినిమాలు, ఇతర వ్యక్తిగత కార్యక్రమాలనే చూసుకుంటూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కమల్ హాసన్ పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 2024 ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్ధతు పలికిన ఆయనకు తమిళనాడు ముఖ్యమంత్రి , డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాజ్యసభ ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇళయ దళపతి విజయ్‌తో పాటు బీజేపీ నేత అన్నామలైలను ఎదుర్కొనేందుకు కమల్ హాసన్‌ను ఆయుధంగా వాడాలని స్టాలిన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి తోడు డీఎంకే కూటమికి దాదాపు 39 ఎంపీ స్థానాలు దక్కడంలోనూ కమల్ కీలకపాత్ర పోషించడంతో ఆయనకు అప్పట్లోనే స్టాలిన్ రాజ్యసభ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
వచ్చే జూన్‌లో తమిళనాడు నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనున్న నేపథ్యంలో ఓ స్థానం నుంచి కమల్ హాసన్‌ను నామినేట్ చేయాలని స్టాలిన్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు , మంత్రి పీకే శేఖర్ బాబు నేరుగా కమల్ హాసన్ ఇంటికి వెళ్లి ఆయనను కలవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇది వ్యక్తిగత కలయికా? లేక నిజంగానే కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్తున్నాడా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.


Click it and Unblock the Notifications











