తాప్సీని వదలలేక గోపీచంద్ తనతో పాటు..
గోపీచంద్, తాప్సీ కాంబినేషన్ లో మొగడు చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను మాత్రం వదిలేది లేదన్నట్లుగా తన తదుపరి చిత్రంలోనూ గోపీచంద్ తీసుకున్నాడు. యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ నిధి అన్వేషణలో పూర్తిగా మునిగి తేలనున్నాడు. గోపీచంద్- చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన 'ఒక్కడున్నాడు' చిత్రం తర్వాత మళ్లీ అయిదేళ్ల విరామం తీసుకుని వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ తమ శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రై.లి. సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ- ''ఇదొక సాహసంతో కూడుకున్న యాక్షన్ చిత్రం. ప్రపంచదేశాలన్నింటిలో ప్రమాదకరమైనదిగా పరిగణించే ఓ దేశంలో అతివిలువైన ఓ నిధి ఉంటుంది. ఆ నిధిని ఓ సామాన్యుడు ఎలా సాధించాడు అనేది ఈ సినిమా కథాంశం. కథకు తగ్గట్టు జోర్డాన్, రాజస్థాన్, లడక్‌లలో చిత్రీకరణకు ప్లాన్ చేశాం. ఇందులో గోపీచంద్ పాత్ర, ప్రవర్తన భిన్నంగా ఉంటాయి. ఈ ఆధునిక యుగంలో జరిగే ట్రెజర్ హంట్ ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది'' అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ..''చందు కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యాను. డబ్బు మనిషిని శాసిస్తున్న అంశం. ఈ కథ కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కథతో తేలిగ్గా ప్రయాణం చేయగలుగుతారు. కథ విని ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. కచ్ఛితంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇది భిన్నమైన కథ. సమాజంలో మనిషికీ, మనీకీ మధ్య చాలా లింకు ఉంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: ప్రశాంత్ అట్లూరి, సుమలత, కెమెరా: శామ్‌దత్, సంగీతం: శ్రీ, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.


Click it and Unblock the Notifications











