రాజమౌళి ఈగల్ని పడితే...తేజ దోమల్ని!
ఈ మధ్య కీటకాల పేర్లు కూడా సినిమా పేర్లుగా వస్తున్నాయి. కందిరీగ, తూనీగ, మిడత ఇలా దేన్ని వదలడం లేదు దర్శకులు. టాప్ దర్శకులు సైతం వాటిపైనే కన్నేశారు. దర్శకుడు రాజమౌళి తన సినిమాకు 'ఈగ' అనే టైటిల్ పెడితే....దర్శకుడు తేజ దోమలను కూడా వదలడం లేదు.
తేజ త్వరలో 'ప్రేమల్స్ దోమల్స్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వినోదాత్మకంగా సాగే ప్రేమకథగా దీనిని రూపొందించడానికి ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇందులో కూడా కొత్త నటీనటులకే అవకాశం ఇస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తేజ తాజాగా రూపొందించిన 'నీకు నాకు డాష్ డాష్' కూడా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో, కొన్ని సీన్లు మార్చి, టైటిల్ లోని 'డాష్ డాష్' తీసేసి, మళ్లీ వదిలాడు. అయినప్పటికీ అది ఆకట్టుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో మరో సినిమా రూపొందించి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి తేజ సన్నద్దమవుతున్నాడు. ఒకప్పుడు కొత్త తరహా ప్రేమకథల అనుభూతిని ప్రేక్షకులకు కలిగించిన తేజ మళ్లీ మళ్లీ అదే మసాలాను రిపీట్ చేస్తూ ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాడు.
తేజ దర్శకత్వంలో ఓ పొలిటికల్ థ్రిల్లర్ విత్ లవ్ స్టోరీ కథాంశంతో సినిమా రాబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఓ చిన్న ప్రేమకథను జోడించి ఈ చిత్రం ఉంటుందట. అయితే తేజ మాత్రం ఇప్పటి వరకు ఏ విషయమూ అధికారికంగా ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











