మీడియాపై తెలంగాణ సినీ నిర్మాత దాడి
ఇక్కడ మేము చెప్పేదే మీరు వినాలి..రాయాలి అంటూ తెలంగాణకు చెందిన నిర్మాత యశ్వంత్ రెడ్డి మీడియా వారిని గద్దించారు. ఆయన ప్రస్తుతం " బాంచన్ నీ కాల్ మొక్తా... ఇంకెన్నాళ్లు" అనే టైటిల్ తో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఆ చిత్రం వివరాలు తెలపటానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఆయన సినిమా విషయాలు ప్రక్కన పెట్టి కొత్తగా 'మా తెలంగాణా అసోసియేషన్', 'తెలంగాణా మీడియా అసోసియేషన్', 'తెలంగాణా ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్' అంటూ తెలంగాణా ప్రాంతానికి చెందిన ఇండస్ట్రీలను నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు.అలాగే వాటి వివరాలును చెప్పటం ప్రారంభించారు.
దాంతో అప్పటికే చాలా సమయం కావటంతో..మీడియా వారు అసోసియేషన్‌ల సంగతి మాకొద్దనీ, సినిమా వివరాలను చెప్పమని అడిగారు. దీంతో నిర్మాత యశ్వంత్ కోపంతో అడిగిన వారిపై విరుచకపడ్డారు.ఏం మీరు చిరంజీవి, మోహన్ బాబులు ప్రెస్ మీట్ పెడితే ఇలాగే ప్రశ్నిస్తారా...? అని గద్దించి అడిగారు.
దానికి మీడియావారు.. తమకు ఎవరైనా, ఏ ప్రాతం వారైనా ఒకటేననీ, కావలసిన సమాచారం మాత్రమే ఇవ్వాలని చెపుతామని తెలిపారు. ఈలోపు తెలంగాణా ప్రాంతానికి చెందిన యాదగిరి అనే నాయకుడు వచ్చి, విలేఖరులును నిందించటం ప్రారంభించాడు. సీమాంధ్రకు చెందిన మీడియా తట్టాబుట్టా సర్దుకుని తక్షణమే వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఇంకా ఎవరైనా తెలంగాణా చూరుబట్టుక వేళాడితే వెళ్లగొట్టడం ఖాయమని ఎగిరి పడ్డారు.
అనంతరం కోపంతో ఊగిపోతూ..ఓ పాపులర్ న్యూస్ ఛానెల్ కు చెందిన కెమేరాను ఎత్తి కిందపడేసి ముక్కలు చేశారు. ఈ పరిణామంతో సినీ విలేఖరులు షాకయ్యారు. మీడియా సమావేశానికి పిలిచి ఇలా దాడి చేయడం భావ్యం కాదని నిరసన తెలిపారు. అయితే అదేమీ పట్టించుకోని యశ్వంత్, యాదగిరిలు తెలంగాణాలో ఉన్న ఆంధ్ర హీరోల షూటింగ్‌లను భవిష్యత్తులో కూడా అడ్డుకుంటామనీ, తెలంగాణా గడ్డపై సీమాంధ్ర హీరోలు సినిమాలు చేయలేరనీ, తమకు తెలంగాణా వచ్చేసిందని గొడవచేసారు. చివరకు ఆ గొడవ పోలీసు కేసులతో ముగిసిందని సమాచారం.


Click it and Unblock the Notifications











