రాజకీయాలపై దళపతి విజయ్ డైలామా? త్వరలోనే బిగ్ డెసిషన్.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
భారతదేశంలో సినిమాకు, రాజకీయాలకు మధ్య అవినాభావ సంబంధం ఉందన్న సంగతి తెలిసిందే. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో స్టార్స్ పార్టీలకు మద్ధతుదారులుగా, సానుభూతిపరులుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఆయా పార్టీల తరపున ప్రచారం చేయడమే కాదు వారే అభ్యర్ధులుగా నిలబడిన ఉదంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగానే కాదు ఏకంగా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా రాజకీయాలను శాసించిన నటలు ఎందరో ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు రాజకీయాల్లోకి వెళ్తుండగా.. ఈ యుద్ధంలో గెలిచినవారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.
సీఎంలుగా ఎదిగిన స్టార్స్
ఉత్తరాది నటుల్లోనూ రాజకీయ నాయకులుగా ఎదిగినవారు ఉన్నారు. అయితే చాలా వరకు ఎమ్మెల్యేల గానో, ఎంపీలుగానో, మంత్రులుగానో, కేంద్ర మంత్రులుగానో మాత్రమే సేవలందించారు. అయితే దక్షిణాదికి వచ్చేసరికి సినీనటులు ఏకంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులుగా మారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఎంజీ రామచంద్రన్, కరుణానిధి, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాలు సినీరంగం నుంచి రాజకీయాల్లోకి దూకి సీఎంలుగా పగ్గాలు అందుకున్నారు. ముఖానికి మేకప్ వేసుకునేవారికి రాజకీయాలు ఏం తెలుసునని హేళన చేసిన వారికి తమ పాలనా దక్షత, వ్యూహాలతో రాజకీయాలే తమ చుట్టూ తిరిగేలా చేసుకున్నారు. ఏకంగా ఢిల్లీ గద్దెను గడగడలాడించి కేంద్రాన్ని శాసించారు.

సొంత పార్టీలతో రాజకీయాల్లోకి
ఈ దిగ్గజాల స్పూర్తితో నేటికీ రాజకీయాల్లో దిగి, సొంత పార్టీ పెడుతున్న నటులు ఎంతోమంది. చిరంజీవి, విజయ్‌కాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, విజయశాంతి, ఉపేంద్ర, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పార్టీలు పెట్టారు. పవర్‌స్టార్‌గా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి పదేళ్ల పాటు ఎన్నో పోరాటాలు చేసి, అవమానాలు భరించి ఎమ్మెల్యేగా విజయం సాధించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ సక్సెస్‌తో పలువురు స్టార్ హీరోలు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు.
రాజకీయాలంటే ఆషామాషీ కాదు
అయితే రాజకీయాలలో కొనసాగడం, పార్టీలను నడపటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పూలు పడిన చోటే రాళ్లు పడతాయి, విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత దూషణలను భరించాలి. వీటిని ఎదుర్కొని నిలబడటం తేలిక కాదు. వీటికి తోడు అంగ బలం, అర్ధ బలం తప్పనిసరి. రాజకీయాలను సరిగా అంచనా వేయలేక మధ్యలోనే పార్టీలను మూసేసిన వారు, రాజకీయాలకు దూరమైన వారెందరో. ఇకపోతే.. తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ హీరోగా, ఇళయ దళపతిగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నారు విజయ్. కోలీవుడ్‌లో నెంబర్‌వన్ హీరోగా, సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటూ వెలుగొందుతున్న దళపతి రాజకీయాల్లోకి దూకారు.
విజయ్‌కి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
గతేడాది తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించి సమర శంఖం పూరించారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు విజయ్. ఇప్పటికే తమ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను నియమించి తానెంతో ప్లానింగ్‌తో ఉన్నానో రాజకీయ నేతలకు హింట్ ఇచ్చారు. రాజకీయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఆయన ప్రస్తుతం నటిస్తున్న జననాయగన్ తన చివరి సినిమాగా ప్రకటించడంతో విజయ్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. సినిమాను వేగంగా పూర్తి చేసిన ఆయన వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న జన నాయగన్‌ను రిలీజ్ చేయనున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ రోర్‌కి భారీ స్పందన వచ్చింది.
జననాయగన్ దళపతి చివరి సినిమానా?
జన నాయగన్ షూటింగ్ పూర్తి కావడంతో ఇక విజయ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తలమునకలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇక ఆయన సినిమాలు చేయరనే బాధ అభిమానులు వేధిస్తోంది. ఇదే ప్రశ్నను జన నాయగన్‌లో నటించిన ప్రేమలు ఫేమ్ మమితా బైజ్ ఓ సందర్భంలో నేరుగా విజయ్‌ను అడిగారట. దానికి ఆయన సమాధానమిస్తూ.. ఈ విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని.. తన భవిష్యత్తు 2026 తమిళనాడు ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పినట్లు మమిత అన్నారు. షూటింగ్ చివరి రోజున చిత్ర యూనిట్‌తో పాటు విజయ్ కూడా ఎమోషనల్ అయ్యారని.. మాతో ఫోటోలు దిగలేకపోయారని మమితా బైజు తెలిపారు.
రాజకీయాలపై విజయ్ ఆలోచనలో పడ్డారా?
ప్రస్తుతం మమితా బైజు వార్తలు తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గటా మారాయి. దీనిని బట్టి ఇప్పటికే రాజకీయాలపై విజయ్‌కి విరక్తి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2026 ఎన్నికల్లో టీవీకే కనుక అధికారంలోకి రాకపోతే విజయ్ తన పార్టీని రద్దు చేస్తారా? ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా? అంటూ చర్చ జరుగుతోంది. టీవీకే అభిమానులు మాత్రం ఎన్నికల్లో ఓడినా, గెలిచినా దళపతి విజయ్ రాజకీయాల్లోనే కొనసాగుతారని, సినిమాలకు వెళ్లరని అంటున్నారు. మరి దళపతి నిర్ణయం ఏమిటనే దానికి కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











