నాగ చైతన్య థాంక్యూ.. లవ్ స్టోరీ తర్వాత అక్కినేని వారసుడు ఇలా!
అక్కినేని వారసుడు నాగ చైతన్య వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవలే వెంకీమామ అంటూ సూపర్ ట్రీట్ ఇచ్చిన చైతూ, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం లవ్ స్టోరీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన క్రేజీ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ చేస్తూనే తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు నాగ చైతన్య. ఇందులో భాగంగా ఇప్పటికే బంగార్రాజు, నాగేశ్వరరావ్ సినిమాలకు కమిట్ అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించి మరో అప్‌డేట్ బయటకొచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా ఓకే చేశారట చైతూ. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కథా కథనాల విషయంలో చర్చలు ముగిశాయని, ఈ చిత్రానికి 'థాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది.
గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'మనం' సినిమాలో నాగ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీ అంతా పాలుపంచుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఆ తర్వాత నాగ చైతన్య సోదరుడు అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' చేస్తే అది డీలా పడింది. మరి ఈ థాంక్యూ పరిస్థితి ఎలా ఉంటుందో! ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











