తెలంగాణలో రాజాసాబ్‌కు టికెట్ ధర పెంపు, స్పెషల్ షోలు లేనట్లేనా? ఏపీలో ప్రీమియర్ షో టికెట్ ఎంతంటే?
ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి భారీ సినిమాలు విడుదలైనప్పుడల్లా ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు అన్న మాటలు వినిపిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో వచ్చే సినిమాల నిర్మాతలు ప్రభుత్వ అనుమతితో తమ సినిమాలకు కొన్నిరోజులు టికెట్ ధర పెంచుకోవడంతో పాటు రిలీజ్‌కు ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తుండటంతో పాటు విషయం కోర్టుల వరకు వెళ్తోంది.
సంక్రాంతికి బాక్సాఫీస్ కళకళ
త్వరలో సంక్రాంతి సీజన్ ప్రారంభం కానుండటంతో చిన్నా, పెద్దా సినిమాలు క్యూలో ఉన్నాయి. జనవరి 9 ది రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒకరాజు తదితర సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు జన నాయగన్, పరాశక్తి సినిమాలు కూడా బాక్సాఫీస్‌ను ముంచెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సినిమాల టికెట్ ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.

ది రాజాసాబ్ ప్రీమియర్స్ షో టికెట్ ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా పెద్దా సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు, స్పెషల్ షోలకు అవలీలగా అనుమతులు దక్కుతున్నాయి. ఇప్పుడు ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర సినిమాలకు ఏపీలో ఎలాంటి ఆటంకాలు లేకుండా టికెట్ ధరల పెంపునకు, ప్రీమియర్ షోలకు అనుమతులు దొరుకుతాయి. తొలుత జనవరి 8న రాత్రి ది రాజా సాబ్, జనవరి 11న రాత్రి మన శంకర వరప్రసాద్ గారికి సినిమాల ప్రీమియర్స్ ఆంధ్రాలో పడనున్నాయి. ప్రభాస్ మూవీకి ప్రీమియర్ షోకి టికెట్ ధర 800 రూపాయలు ఉంటుందని, అలాగే చిరంజీవి సినిమాకు టికెట్ ధర 500 రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసే జీవోను బట్టి ఈ ధరలు, అనుమతులపై క్లారిటీ రానుంది.
పుష్ప 2 తొక్కిసలాటతో రేవంత్ సీరియస్
అయితే ఎటోచ్చి తెలంగాణలోనే పరిస్ధితులు మారిపోయాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు టాలీవుడ్ పెద్దలు ఏం కోరితే అది తక్షణం చేసిపెట్టేవారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులతో పాటు ఎలాంటి సమస్యలు వచ్చిన నేనున్నానంటూ కేసీఆర్ - కేటీఆర్‌లు ముందుండేవారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చాక కూడా టాలీవుడ్‌కు అన్ని రకాలుగా సాయం చేసింది. కానీ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో పరిస్థితులు మారిపోయాయి. ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి.. తాము అధికారంలో ఉన్నంతకాలం తెలంగాణలో సినిమాలక ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపునకు అనుమతించేది లేదని తేల్చిచెప్పారు.
టికెట్ ధరల పెంపుపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు
అయితే హరిహర వీరమల్లు, ఓజీ, అఖండ 2 తదితర సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ షోలకు, టికెట్ ధరల పెంపునకు అనుమతించడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. కొందరు ఈ విషయంలో న్యాయస్థానానికి కూడా వెళ్లడంతో కోర్ట్ సీరియస్ అయ్యింది. దాంతో ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచాలంటూ తన వద్దకు రావొద్దని తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చిచెప్పారు. దాంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలకు తెలంగాణలో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్స్ షోలకు అనుమతి ఉంటుందా? ఉండదా? అనే చర్చ జరుగుతోంది. సినీ పెద్దలు రంగంలోకి దిగి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశం లేకపోలేదని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడే ఉంటుందా? లేదా? అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











