‘డమరుకం’ విడుదలలో మరో ట్విస్ట్
హైదరాబాద్ : నాగార్జున నటించిన 'డమరుకం' చిత్రం విడుదల విషయంలో ప్రేక్షకులు ఇప్పటికే అనేక ట్విస్ట్ లను స్వయంగా వీక్షించిన సంగతి తెలిసిందే. ఇటీవల నవంబర్ 10న సినిమా విడుదలవ్వాల్సి ఉండగా.... సినిమా థియేటర్ల వద్ద ప్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేసిన తర్వాత సినిమా ప్రదర్శించడానికి కొన్ని నిమిషాల ముందు ఎవరూ ఊహంచని విధంగా వాయిదా పడింది. ఆర్థిక సమస్యల వల్ల ఈచిత్రాన్ని నవంబర్ 23కు వాయిదా వేసారని ప్రచారం జరిగింది.
తాజాగా మరో ట్విస్ట్ ఏమిటంటే ఈచిత్రం నవంబర్ 23న కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, అప్పటికీ కుదరక పోతే డీవీడీ వెర్షన్ విడుదల చేసే అవకాశం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఏది ఏమైనా ఈ విషయాలు ప్రొడక్షన్ హౌస్ నుంచి అధికారికంగా కన్ ఫర్మ్ కావాల్సి ఉంది.
ఈ నెల 10న సినిమా వాయిదా పడటానికి గల కారణాన్ని పరిశీలిస్తే...
ప్రముఖ సినీ ఫైనాన్సియర్ సత్య రంగయ్య తనకు రావాల్సిన రూ. 10కోట్ల కోసం పేచీ పెట్టాడని, సినిమా విడుదల కాకుండా చేసాడని తెలుస్తోంది. నిర్మాత దగ్గర అంత డబ్బు లేక పోవడంతో నాగార్జున తాను తీసుకున్న రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసాడని, యూఎస్ నుంచి రావాల్సిన ఫండ్స్ వస్తే మ్యాటర్ సెటిల్ చేద్దామని ట్రై చేసినా అవి అందక పోవడంతో ఈ నెల 10న సినిమా విడుదల కాలేదని అంటున్నారు.
డమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించగా, ఆర్ వెంకట్ నిర్మించారు.. వెయ్యి సంవత్సరాల తర్వాత అంధకాసురుడు మళ్లీ పుట్టి పంచభూతాలైన భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరును తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని, ప్రపంచాన్ని వశం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. త్రిమూర్తుల్లో ఒకరైన శివుని సహాయంతో ఒక సామాన్య వ్యక్తి ఆ రాక్షసుడితో ఎలా పోరాడాడు, ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది ఈచిత్రం కథ. నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, రవి శంకర్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











