ఏపీ క్యాబినెట్‌లో పవన్ కల్యాణ్‌కు కీలక పదవి.. చంద్రబాబు ఇచ్చిన ట్విస్ట్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలన విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజీపీ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నది. అయితే ఈ కూటమిలో పవన్ కల్యాణ్ కీలకంగా మారడంతో ఇప్పటి మాదిరిగా కాకుండా ఈ సారి ప్రభుత్వ ఏర్పాటు అత్యంత ప్రత్యేకంగా మారింది. అయితే పవన్ కల్యాణ్‌కు ఎలాంటి పదవి ఆఫర్ చేస్తారు? పవర్ స్టార్ ఏ పదవిని కోరుకొంటున్నారనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాలోను, రాజకీయ వర్గాల్లోను విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్త విషయంలోకి వెళితే..
ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసే క్యాబినెట్‌లో జనసేనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విషయంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల పలు దఫాలు పవన్, బాబు ఇద్దరు చర్చలు జరిపారు. బీజేపీకి ఎన్ని మంత్రి పదవులు ఇచ్చే విషయంపై సుదీర్ఘంగా చర్చలు జరిపి తుది జాబితాను సిద్దం చేసినట్టు తెలుస్తున్నది.

అయితే పవన్ కల్యాణ్‌ను తప్పనిసరిగా డిప్యూటీ సీఎం పదవిని చేపట్టాలని చంద్రబాబు కోరారు. అయితే గత ప్రభుత్వాల్లో మాదిరిగా ముగ్గురు, నలుగురు డిప్యూటీ సీఎంల పదవులను ఏర్పాటు చేయకుండా.. త్వరలో ఏర్పడే సర్కారులో ఒకే ఒక డిప్యూటీ సీఎం పదవి ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కల్యాణ్ ప్రతిష్టకు, ఇమేజ్ ఎలాంటి భంగం కాకుండా చర్యలు తీసుకొంటున్నారు. సీఎంకు ఇచ్చే ప్రొటోకాల్‌ను డిప్యూటీ సీఎంకు ఇచ్చేలా.. అందులో ఎలాంటి తేడా లేకుండా ఉండాలనే విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరవేశారు అనేది తాజా సమాచారం.

ఇక ఏపీ ప్రభుత్వంలో జనసేనకు కీలక పదవులు ఇచ్చేందుకు అంగీకారం జరిగింది. పవన్‌తోపాటు మరో ముగ్గురు మంత్రులు జనసేన నుంచి ఉంటారు. వారు కూడా 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. అయితే గవర్నర్ వద్ద ఆ రోజు చంద్రబాబు ఒక్కరే ప్రమాణం చేస్తారా? పవన్ కూడా ప్రమాణం చేస్తారా? అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











