ఎన్టీఆర్ కొత్త సినిమాలో మరో స్టార్ హీరో: సెంటిమెంట్ ఫాలో అవుతోన్న డైరెక్టర్
కొన్నేళ్లుగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఈ మూవీ పట్టాలపై ఉండగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు తారక్.
'అరవింద సమేత.. వీరరాఘవ' తర్వాత త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'అయిననూ పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఇటీవల దీనికి 'రాజా వచ్చినాడు' అనే పేరును కూడా అనుకుంటున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. టైటిల్ విషయాన్ని పక్కన పెడితే.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తాజాగా ఓ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

దీని ప్రకారం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రను పోషిస్తున్నాడట. గతంలో అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'సన్నాఫ్ సత్యమూర్తి'లో నటించాడు. ఇది సూపర్ హిట్ అయింది. ఇప్పుడా సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఎన్టీఆర్ సినిమాకు కూడా తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, ఇందులో నందమూరి హీరో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే, ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











