సీక్రెట్‌గా బాలయ్య హీరోయిన్ ప్రేమాయణం? వింబుల్డన్ మ్యాచ్‌తో గుట్టురట్టు.. ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో ప్రస్తుతం సినీతారల డేటింగ్ వార్తలే కనిపిస్తున్నాయి. ఎప్పుడు? ఎవరు? ఎవరితో ప్రేమలో పడతారో? తెలియడం లేదు. సినిమాల్లో మాదిరిగా బాయ్‌ఫ్రెండ్స్‌తో కనిపించి షాకులిస్తున్నారు హీరోయిన్లు. ఈ విషయంలో హీరోలు కూడా ఏం తక్కువ తినడం లేదు. హీరోయిన్లతో ఎఫైర్లు నడుపుతూ పలువురు స్టార్స్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ బాంబ్, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ ఊర్వశి రౌటేలా సీక్రెట్‌గా ప్రేమాయణం నడుపుతున్నట్లు బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
15 ఏళ్ల వయసులోనే మోడల్‌గా
15 ఏళ్ల చిన్నవయసులోనే మోడలింగ్ ప్రారంభించిన ఊర్వశి.. 2009లో మిస్ టీన్ ఇండియా టైటిల్ నెగ్గారు. అనంతరం మిస్ యూనివర్స్ ఇండియా 2015 పోటీలలో టైటిల్ గెలిచిన ఊర్వశి రౌటేలా ఆ తర్వాత మిస్ యూనివర్స్ 2015 పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహించారు. తొలుత సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాలో సన్నీడియోల్ సరసన హీరోయిన్‌గా నటించారు ఊర్వశి.. ఈ సినిమాలో తనకంటే 35 ఏళ్లు పెద్దవాడైన సన్నీతో లిప్‌లాక్, రొమాంటిక్ సీన్స్‌లో నటించి షాకిచ్చారు. ఈ తర్వాత కన్నడలో మిస్టర్ ఐరావత అనే సినిమాలో కనిపించింది ఊర్వశి.

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా
హీరోయిన్‌గా సక్సెస్ కావడం కష్టమని గ్రహించిన ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్స్‌తో దుమ్మురేపారు. హిందీ జనాలను ఊపేస్తున్న టైంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్యలో బాస్ పార్టీ సాంగ్‌తో తెలుగువారిని పలకరించారు. ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంధలలో ఐటెం సాంగ్స్ చేశారు ఊర్వశి రౌటేలా. ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్‌లో ఎస్ఐ జానకీగా అలరించింది. ప్రస్తుతం బ్లాక్ రోజ్, వెల్‌కమ్ టూ ది జంగల్, కసూర్ 2 సినిమాలలో ఊర్వశి రౌటేలా నటిస్తున్నారు.
వారితో డేటింగ్ అంటూ రూమర్స్
అందరు హీరోయిన్ల మాదిరిగానే ఊర్వశి రౌటేలా కూడా పలువురితో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యాతో పాటు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కరీమ్ బెంజమాతో ఆమె ప్రేమలో పడినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే వీటిని పలుమార్లు ఆమె ఖండించారు. తాజాగా లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఊర్వశి సందడి చేశారు. ఈ సందర్భంగా వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్‌ను కలిశానంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే పబ్లిసిటీ కోసం ఆమె ఇలా చేశారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
ఇదిలాఉండగా.. ఇదే వింబుల్డన్‌లో ఓ మిస్టరీ మ్యాన్‌తో ఊర్వశి కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసిన ఊర్వశి.. ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా లవ్ సింబల్స్‌తో కప్పేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ ఈ మిస్టరీ వ్యక్తితో ఊర్వశి పలుమార్లు కనిపించింది. దీంతో ఈ ముద్దుగుమ్మ నిజంగానే ప్రేమలో పడిందా? ఊర్వశితో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఊర్వశి స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











