‘వాల్మీకి’ టైటిల్ మార్చే ఆలోచనలో హరీష్ శంకర్!
దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలు చిత్రీకరణ దశలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. గతంలో ఈ దర్శకుడు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన 'డిజె-దువ్వాడ జగన్నాథం' మూవీ సమయంలో బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీలోని ఓ పాటలో మార్పులు చేశారు.
తాజాగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న 'వాల్మీకి' వివాదంలో ఇరుక్కుంది. బోయ వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వారు... సినిమా డ్రామా కోసం తమ కుల దైవం వాల్మీకి పేరు వాడటంపై ఆగ్రహంగా ఉన్నారు. టైటిల్ మార్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీనిపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఇటీవల అనంతపురంలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేయగా బోయ వాల్మీకి కులానికి చెందిన కొంత మంది అక్కడకు వచ్చి షూటింగ్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. వాల్మీకి అనేది తమ కులానికి చెందిన దైవం పేరు అని, దాన్ని ఉపయోగించుకోవడమే గాక తుపాకీ వంటి ఆయుధాన్ని పట్టి స్టిల్స్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై హరీష్ శంకర్ రెస్పాండ్ అవుతూ... టైటిల్ మార్చే విషయంపై ఆలోచన చేస్తామన్నారు. వాల్మీకి అనేది సినిమాలో హీరో వరుణ్ తేజ్ పాత్ర పేరు కాదని స్పష్టం చేశారు. మరి హరీష్ ఈ మూవీ టైటిల్ మార్చబోతున్నారా? లేదా? అనే విషయమై త్వరలో క్లారిటీ రానుంది.
'వాల్మీకి' చిత్రాన్ని 14 రీల్స్ ప్లాస్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట భారీ స్థాయిలోనిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ కల్ట్ గ్యాంగ్‌స్టర్ కామెడీ మూవీ 'జిగర్తాండ' చిత్రాన్ని తెలుగులో 'వాల్మీకి' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో బాబీ సింహా పోషించిన పాత్రను తెలుగులో వరుణ్ తేజ్ చేస్తున్నాడు. సిర్థార్థ్ పాత్రలో అథర్వ మురళి కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











