బిగ్ బాస్ 3 కంటెస్టెంట్, నటి వనిత అరెస్ట్‌కు రంగంలోకి తెలంగాణ పోలీస్?
సినీ నటి, ప్రముఖ నటుడు విజయ్ కుమార్-మంజుల కూతురు వనిత కొన్ని రోజులుగా వివాదాల్లో మునిగి తేలుతోంది. ఆ మధ్య తన తండ్రికి సంబంధించిన ఇంటి విషయంలో రోడ్డెక్కి రచ్చ చేసి మీడియాకెక్కింది. వనిత మీద ఆమె తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేశారంటే... ఇద్దరి మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం వనిత తమిళంలో ప్రారంభమైన 'బిగ్ బాస్ సీజన్ 3'లో పోటీ దారుగా ఎంటయ్యారు. ఈ షోను ప్రముఖ నటుడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో సైతం ఆమె తన వివాదాస్పద వైఖరితో అందరితో గొడవలు పడుతోంది. కాగా... ఆమెను బిగ్ హౌస్ నుంచి బయటకు రప్పించి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

2007లో వివాహం, ఆపై విడాకులు
వనిత 2007లో ఆనంద్ రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి కాపురం ఎంతో కాలం సాగలేదు. ఇద్దరి మధ్య పొసగక పోవడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వీరి కూతురు జోవిత కోర్టు సూచన మేరకు ఆనంద్ రాజ్ కష్టడీలో ఉంది.

కిడ్నాప్ కేసు పెట్టిన మాజీ భర్త
వనిత తన కూతురును హైదరాబాద్ నుంచి చెన్నై తీసుకెళ్లి ఎక్కడో దాచింది అంటూ ఫిబ్రవరిలో ఆనంద్ రాజ్ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు ఎక్కడుందో కనుక్కొని వనితపై కిడ్నాప్ కేసు పెట్టాలని అతడు హెబియస్ కార్పస్ పిటీషన్ వేశాడు.

ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వనిత
వనిత ప్రస్తుతం తమిళంలో ఇటీవల ప్రారంభమైన ‘బిగ్ బాస్ తమిళ సీజన్ 3'లో కంటెస్టెంటుగా ఉన్నారు. బిగ్ బాస్ ఇంట్లో సైతం ఆమె తన వైఖరి మార్చుకోలేదు. అందరితో గొడవ పడుతూ, కొందరిని తన మాటలతో బాధపెడుతూ తన నైజం ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల ప్రసారమైన కొన్ని ఎపిసోడ్లు స్పష్టం చేస్తున్నాయి.

వనితను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి తెలంగాణ పోలీసులు
వనిత ప్రస్తుతం ‘బిగ్ బాస్ 3'షోలో ఉండటంతో... ఆమెను అరెస్ట్ చేసేందకు తెలంగాణ పోలీసులు చెన్నై సమీపంలోని నజ్రత్‌పేట్ పోలీసులను కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఈవిపి ఫిల్మ్ సిటీలో ఈ షోకు సంబంధించిన సెట్ ఉంది. వనితను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు తమిళనాట హాట్ టాపిక్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











