మహేశ్‌బాబు - రాజమౌళి మూవీ ఈవెంట్‌కు ఖర్చెంత? నిర్మాతకు ఎన్ని కోట్ల లాభమంటే?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న మూవీ వారణాసి. నిన్నటి వరకు ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారు? మహేశ్ లుక్ ఎలా ఉండబోతోంది? అంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటికీ నవంబర్ 15న రామోజీ ఫిలింసిటీలో జరిగిన ఈవెంట్‌లో చెక్ పెట్టేశారు రాజమౌళి. ఈ సినిమా పేరును వారణాసిగా ఫిక్స్ చేయడంతో పాటు మహేశ్ లుక్‌ను విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. అయితే ఈ ఈవెంట్‌కు అయిన ఖర్చెంత? నిర్మాతకు వచ్చిన లాభమెంత? ఈ వివరాల్లోకి వెళితే..
ఎస్ఎస్ఎంబీ 29 బడ్జెట్, తారాగణం
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ వారణాసి సినిమాను నిర్మిస్తున్నారు. మహేశ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా... మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తుండగా.. విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఇటీవలే పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు జక్కన్న. ఇందులో కుంభగా పృథ్వీరాజ్... మందాకినిగా ప్రియాంక చోప్రాలు నటిస్తున్నారు. దాంతో ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌పై ఆసక్తి
తన సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు అప్‌డేట్స్ ఇవ్వడానికి రాజమౌళి పెద్దగా ఇష్టపడరు. తన సినిమాలోని క్యారెక్టర్లు, ఇతర విశేషాలను ఒక్కొక్కటిగా విడుదల చేయడం ఆయన స్టైల్. అలాంటిది వారణాసి చిత్రం కోసం తన రూల్స్ తనే బ్రేక్ చేశారు జక్కన్న. పృథ్వీ, ప్రియాంకల పోస్టర్స్ వదిలిన వెంటనే సంచారి సాంగ్‌ను కూడా విడుదల చేసి కలకలం రేపారు. అయితే ఈ సినిమా టైటిల్, మహేశ్ బాబు లుక్‌ను నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌లో అనౌన్స్ చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి టేకప్ చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో పాటు మహేశ్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తుండటంతో గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్‌పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
రాజమౌళి కొత్త ట్రెండ్
దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో వారణాసిని తీస్తుండటంతో తన నిర్మాతను రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్‌లో పడేయాలని రాజమౌళి ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ ప్రసార హక్కులను జియో హాట్‌స్టార్‌కి విక్రయించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రసార హక్కుల విలువ 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల మధ్య ఉండొచ్చని టాక్.
గ్లోబ్ ట్రాట్టర్ ఈవెంట్ ఖర్చెంత?
అలాగే టైటిల్ లాంచ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్.. అందులోని భారీ ఎల్ఈడీ స్క్రీన్ కోసమే దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీనితో పాటు వేదిక, కుర్చీలు, టేబుల్స్, సెక్యూరిటీ సిబ్బంది, నటీనటులు, సిబ్బంది, జాతీయ, అంతర్జాతీయ మీడియాకు వసతి, రవాణా సదుపాయాలు, ఈ ఈవెంట్‌కు పబ్లిసిటీ ఖర్చు, రామోజీ ఫిలింసిటీ యాజమాన్యానికి చెల్లించాల్సిన అద్దె ఇలా మొత్తం కలిపి వారణాసి ఈవెంట్‌కు దాదాపు 15 కోట్ల రూపాయల ఖర్చు అయినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే ఖర్చేనా నిర్మాతకు ఆదాయం సంగతి ఏంటీ అనేది చూస్తే మీడియాలో చెబుతున్నట్లు జియో హాట్ స్టార్ కనుక గ్లోబ్ ట్రాట్టర్ ప్రసార హక్కులను 50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసుంటే.. నిర్మాతకు ఇక్కడే 35 కోట్ల రూపాయలు వచ్చింది. దీనితో పాటు లైవ్ టెలికాస్ట్ సందర్భంగా యాడ్ షేరింగ్ విధానంలో జియో హాట్‌స్టార్ నుంచి 5 కోట్ల రూపాయల వరకు వచ్చినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే నిర్మాత కేఎల్ నారాయణకు లాభాలు వచ్చాయో? లేదో? తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











