వెంకీ లెగ్గెట్టాలా.. సినిమా హిట్టవ్వాల!
ఎవరైనా అడుగు పెట్టడం వల్ల మంచి జరిగితే గోల్డెన్ లెగ్ అంటారు.... చెడు జరిగితే ఐరన్ లెగ్ అంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్ గోల్డెన్ లెగ్ బిరుదు సొంతం చేసుకున్నారు. ఆయన లెగ్గెట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందుకు ప్రత్యేకమైన కారణ కూడా ఉంది లెండి.
మహేష్ బాబు హీరోగా వచ్చిన 'దూకుడు' చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం కూడా బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ విజయాల వెనక వెంకీ గోల్డెన్ లెగ్ ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో సాగుతోంది.
ఆ సినిమా షూటింగులు జరుగుతున్న సమయంలో ఆయన సెట్స్‌కు వెళ్లి హీరోలను పలకరించారు. ఆయన అలా వెళ్లిన కారణం ఏమిటో తెలియదు కానీ.... వెంకీ కాలుమొపడం వల్లనే సినిమాలు హిట్టయ్యాయనే ఓ సెంటిమెంటు పుట్టుకొచ్చింది. తాజాగా వెంకీ తన అన్న కొడుకు రాణా నటిస్తున్న 'కృష్ణం వందే జగద్దురుమ్' సెట్స్ ను సందర్శించారు. దీంతో ఈ సినిమా కూడా తప్పుకుండా హిట్టవుతుందని అంటున్నారంతా....
పరిశ్రమలో ఇలాంటి సెంటిమెంట్లను చాలా మంది దర్శక నిర్మాతలు గుడ్డిగా నమ్ముతుంటారు. పలానా దర్శకుడు, నిర్మాత, యాక్టర్ చేతుల మీదుగా సినిమా ప్రారంభిస్తే అది హిట్టవుతుందట అంటూ...వాళ్ల డేట్స్ దొరకకుంటే ప్రారంభోత్సవాలు వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో పాటు, మెహర్ రమేష్ దర్శకత్వంలో 'షాడో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పాపం వెంకీ అడుగు పెట్టిన సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తున్నాయి కానీ ఆయన సినిమాలు మాత్రం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించలేక పోతున్నాయి.


Click it and Unblock the Notifications











