వాటన్నంటికీ ఓకే అంటేనే.. రాములమ్మ కండీషన్లకు దర్శకనిర్మాతలు షాక్
సరిలేరు నీకెవ్వరు తో 13 ఏళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. తెలుగు సినీ తెరపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఓ గుర్తింపును తీసుకొచ్చిన విజయశాంతి.. లేడీ అమితాబ్‌గా స్టార్ స్టేటస్‌ను అనుభవించింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో దాదాపు పదమూడేళ్లు సినిమా రంగానికి దూరమైంది. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన గ్లామర్, ప్రతిభ ఏ మాత్రం చెక్కుచెదరలేదని నిరూపించింది.

ముందు నుంచీ హైప్..
సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయ శాంతి పాత్రపై మొదట్నుంచీ భారీ హైప్‌ను క్రియేట్ చేస్తూనే వచ్చారు. అద్భుతమైన పాత్ర అని, పవర్ ఫుల్ పాత్ర అని ఇలా ఎంతో గొప్పగా చెప్పి ఊరించారు. అయితే తీరా సినిమా చూస్తే మరీ అంత గొప్పగా ఏమీ లేదనీ తేల్చి పడేశారు సినీ ప్రేక్షకులు. ముఖ్యమైన పాత్రే కానీ యూనిట్ చెప్పినంత పవర్ఫుల్ పాత్ర అయితే కాదని టాక్ వినిపించింది.

భారీగా డిమాండ్..
దాదాపు పదమూడేళ్ల తరువాత ఎంట్రీ ఇవ్వడంతో.. చాలా గ్రాండ్‌గా ఉండాలని భావించిన విజయశాంతికి సరిలేరు నీకెవ్వరు కలిసి వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ రష్మిక మందాన్న కంటే ఎక్కువ పారితోషికం విజయశాంతికే దక్కిందని వార్తలు కూడా వచ్చాయి. ఈ లెక్కన సరిలేరు సినిమాకు గానూ లేడీ సూపర్ స్టార్‌కు బాగానే ముట్టినట్టు తెలుస్తోంది.

సినిమాలపై దృష్టి..
ఇక నుంచి సినిమాలపై కూడా దృష్టి పెట్టాలని విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె కోరికల చిట్టా మాత్రం ఏడుకొండల వాడు కూడా బయపడేంత ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె చెప్పిన కండీషన్లన్నీ ఒకెత్తు అయితే.. చివర్లో పెట్టే మెలిక మరో ఎత్తని టాక్.

కండీషన్లు వింటే షాక్..
స్టార్ హీరో సినిమాల్లోనే చేస్తానన్నది విజయశాంతి మొట్టమొదటి కండీషన్ అని తెలుస్తోంది. యంగ్ హీరోలు, చిన్నా చితకా సినిమాలైతే అసలు కథే విననని మొహం మీదే చెబుతోందట. అంతే కాదు.. ఏ హీరోతో సినిమా చేస్తే, ఆ హీరోకి ఇచ్చే కంఫర్ట్స్ తనకూ కావాలి అంటోందట. ప్రచారంలో తను కూడా ప్రముఖంగా కనిపించాలని, ముఖ్యంగా పోస్టర్లలో హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యం ఇవ్వాలని అంటోందట. తన పాత్ర నిడివి ముందు ఎంత చెబితే అంతే ఉండాలని, తీసిన సన్నివేశాలు ఒక్కటీ తొలగించకూడదని చెబుతోందట. ఈ షరతులన్నింటికీ ఒప్పుకుంటే... అప్పుడు కథ వినడానికి సద్దంగా ఉంటుందట. ఆమె అడిగే పారితోషికం కంటే, ఈ షరతులే కఠినంగా ఉన్నాయని అందరూ అనుకుంటున్నారట.


Click it and Unblock the Notifications











